: కేన్సర్‌ వ్యాప్తిని కంట్రోల్‌ చేయవచ్చు


కేన్సర్ అనేది ఒక్కసారి మన శరీరంలోని ఏ భాగానికి వచ్చినా, చివరికి ఇతర భాగాలకు కూడా వ్యాపించి మొత్తం మన జీవితాన్నే బలితీసుకుంటుంది. ఇలా కేన్సర్‌ వ్యాధి ఇతర భాగాలకు వ్యాపించకుండా దాన్ని రక్తంలోనే అంతం చేసే విధానాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో కేన్సర్‌ వ్యాధిని నివారించడంలో తాము కనుగొన్న విధానం ద్వారా చక్కగా కేన్సర్‌ కణాలను అంతం చేయవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

అమెరికాలోని కార్నెల్‌ యూనివర్సిటీకి చెందిన బయోమెడికల్‌ ఇంజనీర్లు కేన్సర్‌ కణాలను అంతమొందించే ఇ`సెలక్టివ్‌, టీఆర్‌ఏఐఎల్‌ ప్రొటీన్లతో అంతం చేయవచ్చని చెబుతున్నారు. ఇ`సెలక్టివ్‌, టీఆర్‌ఏఐఎల్‌ ప్రోటీన్లతో తాము నిర్వహించిన ప్రక్రియ విజయవంతమైనట్లు పరిశోధకులు తెలిపారు. కేన్సరు కణాలను చంపే శక్తిగల ఈ ప్రొటీన్లను తెల్లరక్తకణాలకు అంటిపెట్టుకునేలా చేయడం వల్ల రక్తంలో కేన్సర్‌ ఇన్‌ఫెక్షన్‌ను అరికట్టవచ్చని చెబుతున్నారు. ఈ ప్రోటీన్లు రక్తంలోకి చేరే కేన్సర్‌ కణాలను గుర్తించి వాటిపై దాడి చేస్తాయని, ఇతర పద్ధతుల కంటే కూడా ఈ విధానం చాలా ప్రభావవంతంగా పనిచేస్తోందని పరిశోధకులు తెలిపారు. ప్రాథమిక దశను దాటిన తర్వాత కేన్సర్‌ వ్యాధి వ్యాప్తి మొదలవుతుందని, దాన్ని అదుపు చేయడానికి తాము కనుగొన్నదే ఉత్తమైన మార్గమని వారు చెబుతున్నారు.

ఈ పరిశోధనలో పాల్గొన్న ప్రొఫెసర్‌ మైకేల్‌ కింగ్‌ దీన్ని గురించి మాట్లాడుతూ, కేన్సర్‌ వ్యాప్తి వల్లే 90 శాతం మరణాలు సంభవిస్తున్నాయని, అందుకే తెల్ల రక్తకణాల సైన్యాన్ని సమర్ధవంతంగా ప్రయోగించగల విధానాన్ని తాము కనుగొన్నామని, తెల్లరక్తకణాలను అంటిపెట్టుకునే ప్రోటీన్ల వల్ల రక్తంలోకి ప్రవేశించే కేన్సర్‌ కణాలు వాటంతట అవే చనిపోతాయని, ఈ విధానంలో కేన్సర్‌ కణాలు తప్పించుకోవడం అసాధ్యమని తెలిపారు. ఇప్పటి వరకూ కేన్సర్‌ కణాలను లక్ష్యంగా చేసుకుని చేస్తున్న చికిత్సలకంటే కూడా ఇది చాలా మెరుగైన విధానమని మైకేల్‌ చెబుతున్నారు.

  • Loading...

More Telugu News