: అబ్బే.. రాహుల్ అస్సలు సరిపోరు: శతృఘ్నసిన్హా
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి పోటీగా రాహుల్ గాంధీ సరిపోడని బీజేపీ సీనియర్ నేత శతృఘ్నసిన్హా అన్నారు. పాట్నాలో ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీ, మోడీకి ఏ విషయంలోనూ సరితూగరని అన్నారు. మోడీ ప్రధాని అయితే దేశం నాశనమవుతుందని ప్రధాని అనడం సరికాదని ఆయన సూచించారు. గుజరాత్ లో మూడుసార్లు నెగ్గి, ప్రజలతో నీరాజనాలు అందుకున్న వ్యక్తిని అలా ఎలా అనగలిగారని ప్రధానిని ఆయన ప్రశ్నించారు.
రాహుల్ కు అన్ని అర్హతలున్నాయన్న ప్రధానికి, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు సరిగ్గా సమాధానం చెప్పారని అన్నారు. ఆప్ విజయానికి కేజ్రీవాల్ తో పాటు పార్టీ శ్రేణులు, అభిమానులు కారణమని కొనియాడిన శతృఘ్నసిన్హా, కేజ్రీవాల్ పనితీరు తెలుసుకునేందుకు మరిన్ని రోజులు అవసరమని అభిప్రాయపడ్డారు. రానున్న ఎన్నికల్లో అద్వానీ కీలకపాత్ర పోషిస్తారని ఆయన విధేయత చాటుకున్నారు.