: అక్కడ ఆడపిల్ల పుడితే ... ఇక పండగే!
ఆడపిల్లల్ని భారంగా భావిస్తూ, భ్రూణ హత్యలకు పాల్పడే మన సమాజం మేఘాలయలోని ఖాసీ గిరిజనజాతిని చూసి సిగ్గుతో తలదించుకోవాలి. ఎందుకంటే, తమ జాతిలో ఎవరికైనా అబ్బాయి పుడితే, ఓ నవ్వు నవ్వుకుని 'సరే' అని సరిపెట్టుకునే అక్కడి ప్రజలు ... అదే అమ్మాయి పుడితే మాత్రం ఆనందంతో గంతులేస్తారు, పండగ చేసుకుంటారు. ఆ పిల్ల తల్లిదండ్రులను అభినందనలతో సత్కరిస్తారు. ఆడపిల్లకి ఆ జాతి ఇచ్చే గౌరవం అది!
అంతే కాదు, తాతల నాటి నుంచి వచ్చే వారి ఆస్తి మొత్తం ఇంటి చిన్న కూతురుకే దక్కుతుంది. అలాగే, పెళ్ళయ్యాక ఆడపిల్ల అత్తారింటికి వెళ్ళదు ... అల్లుళ్ళే ఇల్లరికం వచ్చేస్తారు. ఒకవేళ ఎవరికైనా ఆడపిల్లలు పుట్టకపోతే, మరోపిల్లను తెచ్చుకుని దత్తత తీసుకుంటారు.
ఇంకా చెప్పాలంటే ... మనలా కాకుండా వారి పిల్లలకు తల్లి ఇంటి పేరే వస్తుందట. ఆడపిల్లకు అంతటి సమున్నత స్థానాన్ని ఇస్తున్నందువల్లే ఆ సమాజం సిరిసంపదలతో తులతూగుతోందని వారి నమ్మకం. ప్రతి చోటా అబ్బాయిలకన్నా అమ్మాయిల నిష్పత్తి తగ్గిపోతుంటే, ఈ ప్రాంతంలో అమ్మాయిల నిష్పత్తి ఎక్కువగా వుండడానికి కారణం ఇదే!