: తెలుగు గడ్డను పాకిస్థాన్, బంగ్లాదేశ్ లా మారుస్తున్నారు: జేపీ


తెలుగు గడ్డను రాజకీయ నాయకుల స్వార్థప్రయోజనాల కోసం పాకిస్థాన్, బంగ్లాదేశ్ లలా తయారు చేస్తున్నారని లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఆయన మాట్లాడుతూ రాజకీయ నాయకులపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లిపోయిందని అన్నారు. చట్టసభలు అంటే ఓట్ల కోసం, గెలిచాక పైరవీల కోసం పని చేసే కార్ఖానాలుగా మారిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

చట్టసభలు అంటే ప్రజలకు నమ్మకం లేదని, ప్రభుత్వాలు కూడా చట్టసభలకు లోబడి పనిచేయడం లేదని ఆయన మండిపడ్డారు. అధికారం చేతిలో ఉంటే అధినేత అవినీతి పరుడైనా, చవటైనా వాడి మాటే చెల్లుబాటవుతుందని, ప్రజల వేదన పట్టించుకునే నాధుడు లేడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవి లేనంత వరకు అణిగిమణిగి ఉన్న నేతలు అధికారం చేతికందగానే విజ్రుంభిస్తున్నారని జేపీ అన్నారు.

ఎంత సేపూ ఓట్లు, సీట్లు, అవినీతి తప్ప ప్రజాప్రయోజనాలు నేతలకు పట్టడం లేదని జేపీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాంతాల పేరు చెప్పి కొందరు, మతాల పేరు చెప్పి కొందరు, కులాల పేరు చెప్పి కొందరు ప్రజల నడ్డి విరుస్తున్నా ఏమీ చేయలేక నిట్టూర్చే దుస్థితి ప్రజలకు పట్టిందని జేపీ ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఓట్లు, సీట్ల కోసం శాసనసభలో ఒక రకమైన వ్యూహాలు, శాసన సభ బయట మరోరకమైన వ్యూహాలు పన్నుతున్నారని ఆయన మండిపడ్డారు. నేతల విధానాల వల్ల నేతలుకానీ, వారి పిల్లలు కానీ, వారి బంధువులు కానీ నష్టపోవడం లేదన్నది ప్రజలు గుర్తించాలని జేపీ పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News