: దీంతో మీరు ఎక్కడున్నా వ్యాయామం చేయవచ్చు
పెరిగిన బరువును తగ్గించుకోవాలనుకునేవారు, లేదా ఆరోగ్యంగా ఉండాలనుకునేవారు ఎక్కువగా ఆధారపడేది వ్యాయామం పైనే. అయితే దీనికి ప్రత్యేకమైన ప్రదేశం, కొంత సమయం నిర్దేశించుకోవాల్సి ఉంటుంది. దీంతో చాలామందికి ఈ రెండూ కూడా కుదరక వ్యాయామం చేయలేకుండా ఉంటారు. ఇలాంటి వారికి చక్కగా ఉపకరించే ఒక సరికొత్త పరికరం మార్కెట్లోకి రానుంది. ఈ పరికరంతో మీరు ఎక్కడపడితే అక్కడ... ఎప్పుడుపడితే అప్పుడు చక్కగా వ్యాయామం చేయవచ్చని దీని తయారీదారులు చెబుతున్నారు.
లాస్‌వేగాస్‌లో జరిగిన 2014 ఇంటర్నేషనల్ ట్రేడ్ షోలో ఒక సరికొత్త పరికరాన్ని ఆవిష్కరించారు. టావో అనే ఈ పరికరం చూసేందుకు మన కంప్యూటర్ మౌస్ లాగా చిన్నగా ఉంటుంది. దీంతో మీరు ఎక్కడ కావాలంటే అక్కడ, ఎప్పుడు కావాలంటే అప్పుడు వ్యాయామం చేసుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ టావోతోబాటు దీనికి అనుసంధానించిన ఒక యాప్ సాయంతో సుమారు యాభై రకాల వ్యాయామాలను చేయవచ్చని దీన్ని తయారుచేసిన వారు చెబుతున్నారు. దీన్ని మన చేతులు, కాళ్లు, ఇతర శరీర భాగాల మధ్య పెట్టుకుని గట్టిగా నొక్కడం వల్ల ఇందులోని సెన్సార్లు మన కండరాలపై ప్రభావం చూపిస్తాయని చెబుతున్నారు. ఈ టావో ఈ ఏడాది మార్కెట్లోకి రానుంది, దీని ధర సుమారు రూ.12 నుండి 15 వేల మధ్యలో ఉంటుందని దీని తయారీదారులు చెబుతున్నారు.