: నీరు కాల్చనూ వచ్చు...
నిప్పు మాత్రమే కాదు... నీటినీ కాల్చవచ్చు... అంతా కాలమహిమ. అదేంటి, నిప్పు కాల్చేగుణం కలిగినదైతే, నీరు నిప్పును ఆర్పే గుణం కలదికదా... మరి ఎలా కాల్చుతుంది అనుకుంటున్నారా... అలాంటి కొత్తరకం నీటిని కనుగొనేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఈ కొత్తరకం నీరు ఎలాంటి అగ్గిపుల్ల లేకుండా దానికదే వస్తువులను దహించేస్తుందట. అలాంటి నీటిని తయారుచేయడానికి శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తున్నారు.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని వ్యోమగాములు మండే గుణం ఉన్న నీటిని తయారుచేసే పనిలో ఉన్నారు. గ్యాస్, నీరు ఈ రెండింటి గుణాల మిశ్రమం ఉండే 'సూపర్ క్రిటికల్ వాటర్'కు మండే స్వభావాన్ని కలిగివుంటుంది. సాధారణ నీటిని 217 రెట్లు పీడనానికి గురిచేసి, 373 డిగ్రీల సెల్సియస్ వరకూ వేడిచేయడం ద్వారా సూపర్ క్రిటికల్ వాటర్‌ను తయారుచేయవచ్చు. ఇలా తయారుచేసిన నీటితో ఎలాంటి మంట లేకుండా వస్తువులను దహించేయవచ్చు. ఈ సూపర్ క్రిటికల్ వాటర్ ద్వారా అటు అంతరిక్షంలోను, ఇటు భూమిపైన ఉండే వ్యర్థాలను నిర్మూలించవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.