: డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తా.. మహిళల రక్షణకు చర్యలు చేపడతాం: చంద్రబాబు
మహిళలు తీసుకున్న డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో ఆయన మాట్లాడుతూ, మహిళల రక్షణే తమ ధ్యేయమని అన్నారు. మహిళల రక్షణ కోసం ప్రత్యేక ఐజీని నియమిస్తామని ఆయన అన్నారు. టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తామని, ఆ నెంబర్ కు మిస్డ్ కాల్ ఇచ్చినా స్పందించి, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. వేధింపులకు సంబంధించిన ఏ సమస్య కోసమైనా ప్రభుత్వం సొంత ఖర్చులతో న్యాయవాదిని నియమించి కోర్టుఖర్చులను భరిస్తుందని బాబు తెలిపారు.
తాము అధికారంలోకి రాగానే వేలాది మంది ఉసురు తీస్తూ ఆడబిడ్డలకు అన్యాయం చేస్తున్న బెల్టు షాపులను రద్దు చేస్తామని ప్రకటించారు. బాలికలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా చదువు చెప్పించే బాధ్యత టీడీపీదని ఆయన అన్నారు. తరువాత ఆడపిల్లలకు పెళ్లి వయస్సు వచ్చే నాటికి రెండు లక్షలు వారికి అందేలా ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామని చంద్రబాబు నాయుడు చెప్పారు.