: ఈ జెల్ బరువును తగ్గిస్తుందట
బరువును తగ్గించుకోవడానికి మనవాళ్లు పడరాని పాట్లు పడుతుంటారు. వ్యాయామం, తిండి తగ్గించడం వంటి చాలా పద్ధతులను ఫాలో అవుతుంటారు. అందుకే, బరువు తగ్గాలనుకునే వారిని దృష్టిలో పెట్టుకుని శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగించి ఒక కొత్తరకం జెల్‌ను కనుగొన్నారు. ఈ జెల్‌ను తింటే అది కడుపులోకి వెళ్లి తిష్టవేసి మనల్ని ఎక్కువగా చిరుతిళ్లు తినకుండా చేస్తుందట. దీంతో మనం బరువు కూడా తగ్గుతామని పరిశోధకులు చెబుతున్నారు.
బర్మింగ్‌హామ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు స్థూలకాయంతో పోరాడేందుకు సహకరించే ఒక కొత్తరకం జెల్‌ను కనుగొన్నారు. ఈ జెల్‌ను తింటే కచ్చితంగా బరువు తగ్గుతారని పరిశోధకులు చెబుతున్నారు. ఈ జెల్‌ను తినగానే అది పొత్తికడుపులోకి వెళ్లి ఆహారం తిన్న చాలాసేపటి వరకూ మన పొట్ట నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుందట. దీంతో మనం చిరుతిళ్లను మానేస్తామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
సాధారణంగా ఆహారం తిన్న గంట, గంటన్నర తర్వాత ఏదో ఒక చిరుతిండిని తినడానికి మనం సిద్ధపడతాం. దీనివల్ల కూడా మన శరీర బరువు పెరుగుతుంటుంది. ఇలాంటి చిరుతిళ్లను నివారించడానికి ఈ జెల్ చక్కగా ఉపకరిస్తుంది. ప్రస్తుతం సమాజంలో పెరిగిపోతున్న స్థూలకాయుల్ని తగ్గించేందుకు ఉన్న ప్రధానమైన సాధనం వారు తిండి తగ్గించడమే. కానీ, అందరికీ ఇది సాధ్యం కాదుకదా... కాబట్టి ఇలా జెల్ ద్వారా అదనపు ఆహారాన్ని తీసుకోవడాన్ని తగ్గించుకోవచ్చని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన జెన్నిఫర్ బ్రాడ్‌బీర్ చెబుతున్నారు.