: నేడు నింగికెగరనున్న జీఎస్ఎల్ వీ-డీ5
భారత అంతరిక్షపరిశోధన సంస్థ(ఇస్రో) కీలకమైన జియో సింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్(జీఎస్ఎల్ వీ-డీ5) నేడు నింగికెగరనుంది. నెల్లూరు జిల్లా శ్రీహరి కోటలో ఉన్న సతీష్ ధావన్ సెంటర్ లో సాయత్రం 4.18నిమిషాలకు 1980 కిలోల బరువున్న సమాచార ఉపగ్రహం జీశాట్-14ను మోసుకుని అంతరిక్షంలోకి వెళ్లనుందని ఇస్రో అధికార ప్రతినిధి దేవీప్రసాద్ కార్నిక్ వెల్లడించారు. 2013 ఆగష్టులోనే దీని ప్రయోగానికి సిద్ధపడిన శాస్త్రవేత్తలు, ప్రయోగానికి రెండు గంటల ముందు ఇంధనట్యాంకులో పగుళ్లు గుర్తించి ప్రయోగాన్ని వాయిదా వేశారు.
7020 అనే ప్రత్యేక అల్యూమినియం లోహంతో తయారైన ఇంధన ట్యాంకు కాలంగడిచే కొద్దీ పగులుతుంది. దాని కారణంగానే పగుళ్లు ఏర్పడ్డాయని తెలిపారు. జీఎస్ఎల్ వీలో దేశీయ క్రయోజనిక్ ఇంజిన్ ను వాడుతున్నారు. మొదటి దశలో ఘన ఇంధనాన్ని, రెండో దశలో ద్రవఇంధనాన్ని, మూడో దశలోని క్రయోజనిక్ ఇంజన్ లో ద్రవీకృత హైడ్రోజన్, ఆక్సిజన్ లను మండించి ఉపగ్రహాన్ని అంతరిక్షంలో ప్రవేశపెడతారు. అక్కడ్నుంచి ఇది పని చేయడం మొదలు పెడుతుంది.