: మాటియో మనసు వాటికి తెలుసు కాబట్టే...
క్రూర జంతువులు మినహా మిగిలిన వాటిలో చాలావరకూ జంతువులు పిల్లల విషయంలో కాస్త దయతో ప్రవర్తిస్తాయి. అలాకాకుండా మనుషులంటే భయపడి దూరంగా పారిపోయే జంతువులు ఒక పసివాడికి మాత్రం తెగ మచ్చికయ్యాయి. అంటే ఆ పసివాడితో స్నేహం చేయడం వల్ల తమకు ఎలాంటి ప్రమాదం రాదని అవి చక్కగా పసిగట్టడం వల్లే ఆ జంతువులకు, ఆ పసివాడికి మధ్య స్నేహం సాధ్యమయ్యింది అని చెప్పాల్సి ఉంటుంది.
ఆస్ట్రియాలోని ఆల్ఫ్స్ పర్వతాల్లో గ్రోస్లోకర్ అనే ప్రాంతంలో కుందేళ్లను పోలిన ఆల్ఫైన్ మార్మట్లు నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటాయి. ఇవి మనుషులు ఎదురుకాగానే తెగ సిగ్గుపడి, ఒకరకమైన సంకేతాలతో తమ గుంపును హెచ్చరించుకుంటూ దూరంగా పారిపోతాయి. ఈ మార్మట్లను మచ్చిక చేసుకోవడం చాలా కష్టం. ఇలాంటి వాటిని ఓ ఎనిమిదేళ్ల కుర్రాడు చక్కగా మచ్చిక చేసుకుని వాటితో స్నేహం కొనసాగిస్తున్నాడు. ఎంతకాలంగా అంటే సుమారు నాలుగేళ్ల కాలంగా.
ఎనిమిదేళ్ల మాటియో వాల్చ్ ఒకసారి కుటుంబంతో కలిసి పిక్నిక్కు వచ్చినప్పుడు మార్మట్లతో స్నేహం ప్రారంభమయ్యింది. ఇక అప్పటినుండి రెండేళ్లకోసారి మాటియో వచ్చినప్పుడల్లా మార్మట్లు అతడిని గుర్తుపట్టి చక్కగా వచ్చి స్నేహంగా పలకరిస్తాయి. మనుషులను చూడగానే పారిపోయే మార్మట్లు మాటియో వాల్చ్ను చూడగానే పరుగున వచ్చి చుట్టుముడతాయి. నిజజీవితంలో మనుషులను చూసి భయపడే మార్మట్లతో స్నేహం సాగిస్తున్న మాటియో వాల్చ్ను రియల్ లైఫ్ మోగ్లీ అని కొందరు ముద్దుగా పిలుస్తుంటారట. ఎంతైనా చిన్న పిల్లల కల్మషంలేని మనసు గురించి మనుషులకన్నా జంతువులే చక్కగా గుర్తించగలవు మరి!