: ఆమ్ ఆద్మీ భవిష్యత్తులో మూడో ప్రత్యామ్నాయంగా అవతరిస్తుంది: హజారే
పార్టీ పెట్టిన ఏడాదికే ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుచేసే స్థాయికి ఎదిగి సంచలనం సృష్టించిన ఆమ్ ఆద్మీ పార్టీ బలంపై సామాజిక కార్యకర్త అన్నా హాజరే పూర్తి విశ్వాసంతో ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ మేరకు తన గ్రామం రాలేగావ్ సిద్ధిలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భవిష్యత్తులో ఏఏపీ దేశంలో మూడో ప్రత్యామ్నాయ పార్టీగా ఎదుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అంతేగాక ఢిల్లీలో ఏఏపీ ప్రభుత్వం పనితీరుపై ఈ సందర్భంగా అన్నా సంతోషం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ మంచి నేపథ్యం గల వ్యక్తని, దేశానికి ఏదో ఒక మంచి చేస్తారన్నారు. త్వరలో కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీలో బలమైన లోకాయుక్తను ఏర్పాటుచేసేందుకు చర్యలు తీసుకుంటుందన్న నమ్మకంతో ఉన్నానని పేర్కొన్నారు.