: నాలుగు కోట్ల ప్రజలకోసమే రాజీనామా: శ్రీధర్ బాబు
నాలుగు కోట్ల మంది మనోభావాలకు సంబంధించిన వ్యవహారం కాబట్టే... శాసనసభ వ్యవహారాల శాఖను కావాలనుకున్నానని శ్రీధర్ బాబు చెప్పారు. తనకు మంచి జరిగిందో, అన్యాయం జరిగిందో చెప్పలేనని అన్నారు. ముఖ్యమంత్రికి రాజీనామాను పంపానని తెలిపారు. మంచి శాఖ లభించిందనేది ప్రస్తుత పరిస్థితుల్లో విషయమే కాదని తెలిపారు. మంత్రుల నివాస ప్రాంగణంలో ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడారు. పవిత్రమైన అసెంబ్లీలో టీబిల్లుపై చర్చ ప్రారంభమైందని ఆయన స్పష్టం చేశారు.
శాసనసభ నిబంధనలను ఉల్లంఘించకుండా తన కర్తవ్యాన్ని నిర్వహించానని శ్రీధర్ బాబు చెప్పారు. తెలంగాణను అడ్డుకునే వ్యక్తులు, వ్యవస్థపైనే తన తిరుగుబాటు అని స్పష్టం చేశారు. తమకు పదవులు ముఖ్యం కాదని చెప్పారు. తమ సహచరులందరూ రాజీనామా చేయరాదని కోరారని... కానీ మనస్సాక్షిని చంపుకోలేకే రాజీనామా చేశానని అన్నారు. వ్యక్తిగత స్వార్థం కోసం తాను రాజీనామా చేయలేదని చెప్పారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా తెలంగాణ ఏర్పాటు ఆగదని తెలిపారు. కేవలం టీబిల్లును ఆపాలనే ప్రయత్నంతోనే తన శాఖను మార్చారని చెప్పారు. ఈ వ్యవహారంతో సీమాంధ్ర నేతల కుట్రలు బయటపడ్డాయని అన్నారు.