: మోడీ ప్రధాని అయితే దేశానికి వినాశనం తప్పదు: ప్రధాని మన్మోహన్
పార్టీ యువనాయకత్వం కొత్త తరం ఆశలు, ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుందని భావిస్తున్నట్టు ప్రధాని మన్మోహన్ తెలిపారు. సాధారణ ఎన్నికల అనంతరం యూపీఏ కొత్త ప్రధానిని ఎన్నుకుంటుందని స్పష్టం చేశారు. కొత్త తరం నాయకులు జాతిని మరింత సవర్థవంతంగా నడిపిస్తారని చెప్పారు. రాహుల్ గాంధీ ప్రధాని పదవికి అర్హుడంటూ కితాబిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థి విషయంలో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. తనకు మరోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టాలన్న ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఈ రోజు ఢిల్లీలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పదేళ్ల కాలంలో ప్రధాని మన్మోహన్ మీడియా సమావేశాన్ని నిర్వహించడం ఇది మూడోసారి మాత్రమే.
ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, పదేళ్ల యూపీఏ పాలనలో దేశం చాలా అభివృద్ధి చెందిందని చెప్పారు. భారతదేశ అభివృద్ధి మళ్లీ పట్టాలపైకి ఎక్కిందని అన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, మౌలిక వసతుల కల్పనల కోసం గత తొమ్మిది ఏళ్లుగా ఎంతో కృషి చేశామని చెప్పారు. అభివృద్ధితో గ్రామీణ ప్రాంతాలను సమ్మిళితం చేసిన ఘనత యూపీఏదేనని చెప్పారు.
జాతీయ ఉపాధి హామీ పథకంతో గ్రామీణ కూలీలు బాగుపడ్డారని ప్రధాని మన్మోహన్ అన్నారు. గ్రామీణ ప్రాంత వేతనాల్లో గతంతో పోలిస్తే ఎంతో పెరుగుదల కనిపిస్తోందని సంతోషం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేనంతగా వ్యవసాయ వృద్ధి తమ హయాంలో జరిగిందని స్పష్టం చేశారు. తమ పరిపాలనలో పేదరికం తగ్గిందని తెలిపారు. అధిక ధరలను అదుపు చేశామని... కానీ, ద్రవ్యోల్బణాన్ని మాత్రం అరికట్టలేకపోయామని చెప్పారు. ధరల పెరుగుదల కాంగ్రెస్ పార్టీని ప్రజల నుంచి దూరం చేసిందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకు, పట్టణాలకు మధ్య అంతరం క్రమేపీ తగ్గుతోందని చెప్పారు.
విద్యా, ఉపాధి రంగాలకు పెద్ద పీట వేశామని ప్రధాని చెప్పారు. ఆహార భద్రత బిల్లుతో సామాన్యుడి ఆకలి బాధలను తీర్చామని అన్నారు. ధరల పెరుగుదలను దృష్టిలో ఉంచుకునే ఆహార భద్రత బిల్లును తీసుకొచ్చామని తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు మందగమనం నుంచి బయటపడుతున్నాయని తెలిపారు. ప్రజాస్వామ్య స్పూర్తి ఏ ఒక్క వ్యక్తికో పరిమితం కాదని... జనచైతన్యమే మూలమని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా తీర్పును శిరసావహిస్తామని తెలిపారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నామని అన్నారు.
యూపీఏ ప్రభుత్వం అనేక చరిత్రాత్మకమైన చట్టాలను అమల్లోకి తీసుకొచ్చిందని ప్రధాని తెలిపారు. గత చట్టాల ఆధారంగానే స్పెక్ట్రం, బొగ్గు కూటాయింపులు జరిగాయని... వీటిలో లోపాలను అధిగమించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. అవినీతి అంతానికి యూపీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. తన కుటుంబ సభ్యులు, బంధులపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవని చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపిస్తామని ప్రధాని స్పష్టం చేశారు. ముస్లింల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ప్రధాని తెలిపారు. సబ్సిడీపై స్పందించడానికి ఇది సరైన సమయం కాదని అన్నారు.
దేవయాని విషయంలో అమెరికాతో నెలకొన్న కోల్డ్ వార్ పై స్పందిస్తూ... భారత్ కు అమెరికా కీలక భాగస్వామి అని, ఆ దేశంతో తామెప్పుడూ సత్సంబంధాలనే కోరుకుంటున్నామని చెప్పారు. అమెరికాతో వ్యూహాత్మక సంబంధాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. సరిహద్దు భద్రత విషయంలో రాజీ పడలేదని అన్నారు. వన్యప్రాణులను కాపాడటానికి కృషి చేశామని చెప్పారు.
గుజరాత్ లో జరిగిన మారణకాండ మళ్లీ ఈ దేశంలో జరగకూడదని కోరుకుంటున్నట్టు తెలిపారు. మోడీ ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే, అంతకన్నా వినాశనం మరొకటి ఉండదని మండిపడ్డారు. సంకీర్ణ ప్రభుత్వంలో కొన్ని ఇబ్బందులుంటాయన్న విషయాన్ని మన్మోహన్ ఒప్పుకున్నారు. కేబినెట్ సమావేశాల్లో తీసుకునే నిర్ణయాలను బయట వెల్లడించలేనని చెప్పారు. ఈ పదేళ్లలో సోనియాగాంధీ, ప్రభుత్వం నుంచి తనకు అనూహ్య మద్దతు లభించిందని తెలిపారు. ఇన్నేళ్ల పరిపాలనలో ప్రభుత్వానికి, పార్టీకి మధ్య ఎన్నడూ విభేదాలు రాలేదని చెప్పారు. పరిపాలనలో రెండు అధికార కేంద్రాలున్నాయన్న విషయాన్ని తాను ఒప్పుకోనని ప్రధాని స్పష్టం చేశారు.