: కోతులకూ స్థూలకాయమే!
స్థూలకాయం అనేది మనలో ఎక్కువగా వేధించే సమస్యగా చెప్పవచ్చు. ఇలాంటి సమస్య కోతులకు కూడా పట్టుకుంది. కోతులకు స్థూలకాయం రావడానికి అవేం తింటాయి... పళ్లూ, కాయలేగా... అనుకోకండి. కొన్ని పెంపుడు కోతులు మనం తినే తిండి పదార్ధాలను చక్కగా లాగించేసి, ఎలాంటి వ్యాయామం చేయకుండా బద్దకంగా ఉండడంతో వాటికీ ఒళ్లు పెరిగిపోయింది. దీంతో వాటి యజమానులు వాటిని వ్యాయామ శాలకు తరలించారు. బ్రిటన్‌లో పెంపుడు కోతులు ఇలా ఒబెసిటీతో బాధపడుతున్నాయట. అక్కడ మామూలుగా మనుషులే ఒబెసిటీతో సతమతమవుతుంటారు. అలాగే వారి పెంపుడు కోతులు కూడా అధిక బరువుతో బాధపడుతున్నాయట.
పెంపుడు కోతులకు వాటి యజమానులు ఎంతో ప్రేమగా తీపి పదార్ధాలు, ఆయిల్ ఫుడ్ ఎక్కువగా పెట్టడం వల్ల వాటికి ఒబెసిటీ వచ్చింది. దీనికితోడు ఇవి పెంపుడు కోతులు కావడంతో పెద్దగా ఆహారం కోసం వెతకాల్సిన పనిలేకుండా చక్కటి రుచికరమైన ఆహారం కోరినంతగా దొరుకుతుంది. దీంతో కోతులు లావుగా తయారయ్యాయట. దీంతో జంతుసంరక్షణ అధికారులు పెంపుడు జంతువుల యజమానులను తీవ్రంగా హెచ్చరించారు. అవి ఉండాల్సిన బరువుకంటే ఎక్కువ బరువుంటే అనేక రకాల సమస్యలు ఎదురవుతాయని వారిని హెచ్చరించడంతో వెంటనే తమ పెంపుడు జంతువుల బరువు తగ్గించాలని యజమానులు సంకల్పించారు. బ్రిటన్ మొత్తంలో సుమారు ఐదువేల పెంపుడు కోతులు ఒబెసిటీ సమస్యతో బాధపడుతున్నాయి. వీటన్నింటినీ యార్క్‌షైర్ మంకీ శాంక్చువరీకి తరలించారు.
అక్కడ కోతులకు సంబంధించిన డైటీషియన్ జేన్‌స్మిత్ ఒకేసారి నలభై కోతులకు బరువు తగ్గడానికి శిక్షణనిస్తాడు. ఈ కోతులన్నింటికీ జేన్ తక్కువ కెలోరీలు ఉన్న ఆహారాన్ని ఇవ్వడం, వాటిచేత క్రమం తప్పకుండా వ్యాయామం చేయించడం వంటివి చేయడంతో చక్కగా కోతులన్నీ స్లిమ్‌గా తయారయ్యాయట. వీటికి కేవలం కూరగాయలు, ఓట్స్‌తో తయారుచేసిన కేకులను మాత్రమే ఆహారంగా ఇవ్వడమేకాదు, వాటికి ఎంతో ఇష్టమైన అరటిపండ్లలో చక్కెర శాతం ఎక్కువగా ఉండడం వల్ల బరువు ఎక్కువగా ఉండే కోతులకు వాటిని ఇవ్వకుండా కట్ చేశాడు. దీంతో ఒక్కోకోతి చక్కగా అరవై రోజుల్లో సుమారుగా పది కేజీల బరువు తగ్గిపోయి స్లిమ్‌గా తయారయ్యాయట. దీంతో కోతుల యజమానులు తెగ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.