: అంగారకుడిపైకి వెళ్లే వారి తుది జాబితాలో 62 మంది భారతీయులు
అరుణ గ్రహంపైన స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న ప్రణాళికలో మరో అంకం పూర్తయింది. అంగారకుడిపైకి వెళ్లే వారిని షార్ట్ లిస్ట్ చేసి 1,058 మందితో కొత్త జాబితాను తయారు చేశారు. ఈ జాబితాలో 62 మంది భారతీయులు ఉన్నారు. నెదర్లాండ్స్ కు చెందిన సంస్థ 'మార్స్ వన్' ఈ యాత్రకు శ్రీకారం చుట్టింది. అంగారకుడిపైన స్థిరమైన కాలనీని ఏర్పాటు చేసే లక్ష్యంతో 2024లో చేపట్టబోయే ప్రయోగానికి కసరత్తులు మొదలుపెట్టింది.
దీనికి సంబంధించి... అంగారకుడిపైన జీవించాలనుకుంటున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చంటూ గతంలో ప్రకటించింది. దీనికి స్పందనగా ప్రపంచ వ్యాప్తంగా 140 దేశాల నుంచి అప్లికేషన్లు వచ్చాయి. దాదాపు 2 లక్షల మంది అంగారక యాత్రకు తాము సిద్ధమంటూ దరఖాస్తులు పంపారు. వారిలో 20 వేల మందికి పైగా భారతీయులు ఉన్నారు. వీరందరినీ వడబోసిన తర్వాత 1,058 మందిని ఎంపిక చేశారు. వీరిలో అత్యధికంగా 297 మంది అమెరికన్లు, 75 మంది కెనెడియన్లు, 62 మంది ఇండియన్లు, 52 మంది రష్యన్లు ఉన్నారు.
మరిన్ని వడబోతల అనంతరం చివరకు ముగ్గురు పురుషులు, ఒక మహిళను అంగారక యాత్రకు ఎంపిక చేస్తారు. వీరు అరుణ గ్రహంపైకి వెళతారు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే... వీరంతా అక్కడకు వెళ్లడమే గానీ... అక్కడ నుంచి తిరిగి రావడం ఉండదు. 2024 నుంచి ప్రతి రెండేళ్లకోసారి నలుగురిని అంగారక గ్రహంపైకి పంపిస్తారు. అక్కడ కాలనీని ఏర్పాటు చేసి, మానవాళిని అభివృద్ధి చేసుకుంటూ వీరు అక్కడే ఉండిపోతారు.