: కేజ్రీవాల్ సర్కారుకు నేడు విశ్వాసపరీక్ష
ఢిల్లీ ఎన్నికల్లో సంచలన విజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కేజ్రీవాల్ ఈ రోజు అసలు సిసలు పరీక్షను ఎదుర్కోనున్నారు. మొత్తం 70 స్థానాలు కలిగిన ఢిల్లీ అసెంబ్లీలో 28 మంది ఎమ్మెల్యేలను కలిగిన ఏఏపీ... కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో ఈ రోజు కేజ్రీ సర్కారు శాసనసభలో విశ్వాస పరీక్షను ఎదుర్కోనుంది. ఏఏపీకి ప్రభుత్వంలో కొనసాగడానికి 36 మంది సభ్యుల బలం అవసరం. దీంతో, ఏఏపీ ప్రభుత్వం కొనసాగుతుందా?, లేదా? అనే విషయం నేడు తేలనుంది.
ఈ మధ్యాహ్నం రెండు గంటలకు మంత్రి మనీష్ శిసోడియా శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెడతారు. అనంతరం కేజ్రీవాల్ ప్రసంగిస్తారు. తర్వాత తీర్మానంపై చర్చ జరుగుతుంది. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో తీర్మానంపై ఓటింగ్ ఉండే అవకాశాలు ఉన్నాయి.