: గుర్రం మేసిందని జరిమానా విధించారు!
గుర్రం వచ్చి మేసిందని అక్కడ జరిమానా విధించారు. పండిన పైరుగానీ మేసేసిందా... అనుకునేరు, పైరుకాదుగానీ... పోరాని చోటుకు వెళ్లి పచ్చగడ్డి మేసినందుకు వాటి యజమానులకు జరిమానా విధించారు. మనదేశానికి పొరుగున ఉన్న చైనా దేశంలోని భూభాగంలోకి మన దేశానికి చెందిన వ్యక్తుల గుర్రాలు పొరబాటున వెళ్లి మేశాయి. ఇందుకుగాను చైనా అధికారులు సదరు గుర్రాల యజమానుల నుండి ఒక్కో గుర్రానికి రూ.300 చొప్పున జరిమానా వసూలు చేశారు.
చైనా వాస్తవాధీన రేఖ సమీపంలో ఉండే ముగ్గురు భారతీయులకు చెందిన సుమారు 43 గుర్రాలు పొరబాటున చైనా భూభాగంలోకి ప్రవేశించాయి. అలా వెళ్లిన వాటిలో కేవలం ఐదు మాత్రమే తిరిగి వెనక్కి వచ్చాయి. మిగిలిన గుర్రాలు ఏమయ్యాయా? అని వెతుక్కుంటూ వెళ్లిన గుర్రాల యజమాలను చైనా సైనికాధికారులు నిర్బంధించారు. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీవారు గుర్రాల యజమానులను బంధించి తమ వద్దనున్న మూడు గుర్రాలను యజమానులకు అప్పగించాలంటే ఒక్కోదానికి రూ.300 పోషణ రుసుము చెల్లించమని డిమాండ్ చేశారు.
చేసేదిలేక ఆ జరిమానాను చెల్లించి మూడు గుర్రాలను విడిపించుకు తెచ్చుకున్న యజమానులు మిగిలిన గుర్రాల జాడ తెలియడంలేదని, అవికూడా చైనా సైన్యం వద్దే ఉండవచ్చని అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. పాపం గుర్రాలకు భూమి ఎవరిది అనే విషయం అస్సలు తెలియదుకదా... పచ్చగడ్డి కనిపించగానే మేస్తూ... అలా వెళ్లిపోయాయి. చివరికి కనిపించకుండా పోయాయి!