: గర్భవతి అయిన భార్యను హతమార్చి.. తగులబెట్టేశాడు
అదనపు కట్నం కావాలంటూ భార్యను చిత్రహింసలు పెట్టి.. చివరకు చంపేశాడు ఆ కిరాతకుడు. ఈ దారుణ ఘటన మహబూబ్ నగర్ జిల్లా కొందుర్గులో ఈరోజు (బుధవారం) జరిగింది. హత్య ఘటనకు సంబంధించిన సమాచారాన్ని కొందుర్గు ఏఎస్ఐ కృష్ణయ్య వెల్లడించారు. కేశంపేట మండలంలోని కొత్తపేట వాసి ఉమాదేవి (22) వివాహం కొందుర్గుకు చెందిన శ్రీనివాస్ తో 2012 డిసెంబరు 7న జరిగింది. వివాహ సమయంలో కట్న కానుకల కింద ఆరు తులాల బంగారం, లక్ష రూపాయల నగదుతో పాటు ఒక బైక్ ఇచ్చారు. జల్సాలకు అలవాటు పడిన శ్రీనివాస్ అదనపు కట్నం కావాలంటూ ఉమాదేవిని వేధించసాగాడు. గత నెలలో గొడవ పడగా ఉమాదేవి తల్లిదండ్రులు సర్దిచెప్పారు. ఇదిలా ఉండగా.. నిన్న (మంగళవారం) రాత్రి ఇంటికి వచ్చిన శ్రీనివాస్ భార్యతో గొడవ పడి రాయితో కొట్టి హతమార్చాడు. ఇవాళ ఉదయం ఇంటి ఆవరణలో కిరోసిన్ పోసి తగులబెట్టాడు. ఇరుగు పొరుగు వారు గమనించి.. నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.