: మెమరీపై దీని ప్రభావం కూడా ఉంటుందట
మన మెమరీపై బోలెడన్ని అంశాలు ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా పాఠశాలలో అయితే విద్యార్ధుల జ్ఞాపకశక్తిపై చాలా విషయాలే ప్రభావం చూపుతాయి. వారు వినాల్సిన పాఠ్యాంశం వారికి ఆసక్తిని కలిగించేదిగా ఉండాలి, ఆసక్తికరంగా బోధించే ఉపాధ్యాయులు కావాలి, తరగతి గది, వాతావరణం... ఇలా చాలా విషయాలే వారి జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపుతాయి. కానీ తాజాగా సంస్కృతి కూడా జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపుతుందని పరిశోధకులు చెబుతున్నారు. మనం చూసిన వస్తువులను, సంఘటనలను జ్ఞాపకం చేసుకోవడంలో సంస్కృతి ప్రభావం ఉంటుందని పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది.
బ్రాండీస్ విశ్వవిద్యాలయానికి చెందిన ఏంజెలా గచెన్ బృందం నిర్వహించిన అధ్యయనంలో వస్తువులను, సంఘటనలను జ్ఞాపకం చేసుకోవడంలో సంస్కృతి ప్రభావం ఉంటుందని తేలింది. వీరు అమెరికా, తూర్పు ఆసియా దేశాలకు చెందిన 64 మందిపై జ్ఞాపకశక్తికి సంబంధించిన పరీక్షలను నిర్వహించి ఈ విషయాన్ని కనుగొన్నారు. అమెరికన్లు వస్తువులు, వ్యక్తులు వంటి ప్రాథమికమైన, దృశ్యప్రధానమైన అంశాలను గుర్తుంచుకుంటారని, తూర్పు ఆసియా వారికి సంఘటనలు, సందర్భాలు వంటి సామాజిక వివరాలు బాగా జ్ఞాపకముంటాయని పరిశోధకులు చెబుతున్నారు. జ్ఞాపకశక్తిపై సంస్కృతి ప్రభావాన్ని పూర్తిస్థాయిలో అర్థం చేసుకుంటే బోధనా పద్ధతుల్లో కూడా ఆ ఫలితాలను అన్వయించవచ్చని ఏంజెలా చెబుతున్నారు.