: కుక్కలని తేలిగ్గా తీసేయకండి... అవి ఉతికిపారేస్తాయి!
కుక్కలేం చేస్తాయి... మహా అయితే ఇంటిని కాపలా కాస్తాయి, మనకు మానసిక ఆనందాన్ని ఇస్తాయి. ఇలా కుక్కల గురించి మనవాళ్లు చాలా తేలికగా చెప్పేస్తారు. కానీ కుక్కలు చక్కగా మన బట్టలను ఉతికేస్తాయి. కుక్కలకు బట్టలను చించడం మాత్రమే తెలుసు. అలాంటిది ఎలా ఉతుకుతాయి అనుకుంటున్నారా... వాషింగ్ మెషిన్ ద్వారా. ఎందుకంటే కుక్కలు కూడా కంట్రోల్ చేయగలిగిన కొత్త తరహా వాషింగ్ మెషిన్‌ను లండన్‌కు చెందిన ఒక కంపెనీ తయారుచేసింది. ఈ మెషిన్‌లో బట్టలను వేసి కుక్కలు చక్కగా దాన్ని ఆపరేట్ చేయగలవని సదరు సంస్థ చెబుతోంది.
లండన్‌కు చెందిన జాన్ మిడిల్‌టన్ ఆఫ్ లాండ్రీ కంపెనీ వూఫ్ టు వాష్ అనే పేరుతో ఒక సరికొత్త వాషింగ్ మెషిన్‌ను రూపొందించింది. అనారోగ్యంతో ఉండేవారు, ప్రత్యేకమైన మనుషులు తమ బట్టలను ఉతుక్కోవడానికి చాలా కష్టపడుతుంటారని, అలాంటి వారికి సాయం చేయడానికి తాము ఈ తరహా మెషిన్‌ను తయారుచేశామని జాన్ మిడిల్‌టన్ కంపెనీ చెబుతోంది.
ఈ మెషిన్‌లో లోడింగ్, స్టార్టింగ్, ఖాళీ చేయడం అంతా కూడా రెగ్యులర్ వాషింగ్‌మెషిన్లలాగే ఉన్నప్పటికీ ఇందులో కుక్కలకు ప్రత్యేకంగా సహాయపడే అన్నిరకాల మోడళ్లు, పరిమాణాలతో తయారైంది. అంతేకాదు కుక్కలకు మెషిన్‌ను ఆన్ చేయడం, ఆఫ్ చేయడం వంటి పనులను నేర్పడానికి వాటికి ప్రత్యేక శిక్షణా తరగతులను నిర్వహించింది కూడా. ఇప్పుడు శిక్షణ పొందిన కుక్కలు అంధులకు, ఆటిజంతో బాధపడుతున్న వారికి, అనారోగ్యంతో సతమతమవుతున్నవారికి బట్టలు ఉతికిపెట్టడంలో ఎంచక్కా సహాయపడుతున్నాయట.