: టెన్షనెందుకు దండగ...
టెన్షను పడడం ఎందుకు... అని మన మిత్రులు చాలామంది మనతో చెబుతుంటారు. కానీ కొన్ని విషయాల్లో మాత్రం మనం టెన్షను పడకుండా ఉండలేం. ఇలా టెన్షను పడడం వల్ల మనకు గుండెపోటు వచ్చే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొందరు చాలా చిన్న విషయాలకే టెన్షన్ పడిపోతుంటారు. ఇలాంటి వారికి మాత్రం కచ్చితంగా గుండెపోటు వచ్చే ప్రమాదముందని పరిశోధకులు చెబుతున్నారు.
నేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎగ్జామిన్ సర్వే పేరుతో అమెరికాలో 25 నుండి 74 ఏళ్ల వయసున్న సుమారు ఏడువేల మందిని పరిశోధకులు పరిశీలించారు. వీరందరికీ రక్త పరీక్షలు నిర్వహించడంతోబాటు వారిలోని ఒత్తిడి స్థాయిలను కూడా అంచనా వేశారు. వారిలో ఒత్తిడి అధికంగా ఉండేవారిలో గుండెపోటు వచ్చే అవకాశాలు 33 శాతం ఎక్కువగా ఉన్నట్టు పరిశోధకులు తేల్చి చెప్పారు. ప్రతి ఒక్కరికీ మానసిక ఒత్తిడి ఉంటుందనీ, కానీ అది ఎక్కువ స్థాయిలో ఉంటే మాత్రం ప్రమాదకరమని పరిశోధకురాలు మాయా లాంబ్రియాస్ చెబుతున్నారు. కాబట్టి జరిగేది జరగకుండా ఆగదు... ఏదో జరిగిపోతుందని అనవసరంగా ఆందోళన చెందకుండా టెన్షన్ ఫ్రీగా ఉండండి. పదికాలాలపాటు ఆరోగ్యంగా ఉండండి.