: ‘అమ్మహస్తం’ అపహాస్యం పాలైంది: డీఎల్
‘అమ్మహస్తం’ పథకం ఆచరణలో అపహాస్యం పాలైందని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి విమర్శించారు. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలంలో స్త్రీశక్తి భవనం, ప్రపంచ బ్యాంకు నిధులతో నిర్మించిన ఉపరితల భాండాగారం (ఓవర్ హెడ్ ట్యాంక్) ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి అనుయాయుల నుంచి 45 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిన చింతపండు నల్లగా ఉండడంతో ఎవరూ వినియోగించడం లేదని ఆయన అన్నారు.
ఆచరణ సాధ్యం కాని జలయజ్ఞం కింద ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిందని డీఎల్ మండిపడ్డారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి లేదని, రానున్న రోజుల్లో జుత్తుపై పన్నువేసే పరిస్థితి వస్తుందని అన్నారు. 35 ఏళ్లు కాంగ్రెస్ పార్టీలో ఉండి లాభం పొంది పార్టీని విమర్శించడం సరికాదని ఆయన జేసీకి హితవు పలికారు.