: కేజ్రీవాల్ సైన్యం వివరాలు ఓ సారి చూద్దాం


ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం సాధించి ఢిల్లీ పీఠంపై సగర్వంగా కూర్చున్న కేజ్రీవాల్ తన మంత్రి వర్గ ఎంపికలోనూ ప్రత్యేకతను చాటారు. ఈ రోజు మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో ఏ ఒక్కరు కూడా 50 ఏళ్ల వయసు దాటలేదు. ఇంకో విషయం ఏంటంటే... ఏ ఒక్కరికీ కూడా గతంలో రాజకీయ అనుభవం లేదు. మొదటిసారి రాజకీయాల్లోకి వచ్చి ఏకంగా మంత్రులైపోయారు. కేజ్రీవాల్ సైన్యం వివరాలు ఓ సారి చూద్దాం.

మనీష్ శిసోడియా (41): కేజ్రీవాల్ కు అత్యంత నమ్మకస్తుడు. ఆయన ఏఏపీలో చేరకముందు సమాచార కార్యకర్తగా, జర్నలిస్టుగా పనిచేశారు. 2011 నుంచి జనలోక్ పాల్ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు.

సోమ్ నాథ్ భారతి (39): ఐఐటీ ఖరగ్ పూర్ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందారు. అలాగే న్యాయశాస్త్రంలోనూ పట్టా పుచ్చుకున్నారు. కాంగ్రెస్ మంత్రి కిరణ్ వాలియాను ఓడించారు.

సత్యేంద్ర కుమార్ జైన్ (49): ఆర్కిటెక్ట్ గా జీవితాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ విభాగంలోని అవినీతితో విసిగిపోయి స్వతంత్రంగా కన్సల్టెన్సీని ప్రారంభించారు. జనలోక్ పాల్ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు.

రాఖీ బిర్లా (26): మాజీ జర్నలిస్టు. ఏఏపీ లో చేరకముందు ఆమె ఓ ప్రైవేటు వార్తా చానెల్లో పనిచేశారు. షీలా ప్రభుత్వంలో తిరుగులేని నాయకుడైన మంత్రి రాజ్ కుమార్ చౌహాన్ ను రాఖీ 10 వేల పైచిలుకు ఓట్లతో ఓడించారు.

గిరీష్ సోనీ (49): భారత్ నవ జవాన్ సభలో పనిచేశారు. ఢిల్లీ నగరంలో తాగునీరు, విద్యుత్ ఛార్జీలపై అలుపు లేని పోరాటం చేశారు. ఏఏపీ నిర్వహించిన ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు.

సౌరబ్ భరద్వాజ్ (34): ఇంజినీరింగ్ తో పాటు, న్యాయశాస్త్రంలోనూ డిగ్రీలు పొందారు. బీజేపీ నేత వీకే మల్హోత్రా కుమారుడు అజయ్ కుమార్ మల్హోత్రాను 13 వేలకు పైగా ఓట్లతో ఓడించారు.

  • Loading...

More Telugu News