: ఫిబ్రవరి 28 నాటికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో లోకాయుక్త ఏర్పాటు: రాహుల్ గాంధీ
2014 ఫిబ్రవరి 28 నాటికి అన్ని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో లోక్ పాల్ తరహాలో లోకాయుక్తను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. లోక్ పాల్ బిల్లు కోసం అన్ని రాష్ట్రాలు మద్దతివ్వాలని ఆయన కోరారు. ఈ విషయంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశానంతరం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో రాహుల్ మీడియాతో మాట్లాడారు. ఈ మీడియా సమావేశానికి ఏపీ సీఎం కిరణ్ తప్ప మిగిలిన ముఖ్యమంత్రులందరూ హాజరయ్యారు. మీడియా సమావేశానికి ముందే ముఖ్యమంత్రి కిరణ్ హైదరాబాద్ బయలుదేరారు.
ఈ సమావేశంలో నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించడానికి ప్రణాళికలు రచించాలని నిర్ణయించామని రాహుల్ తెలిపారు. నిత్యావసర సరుకులు బ్లాక్ మార్కెట్ కు తరలిపోకుండా కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్టు చెప్పారు. దీనికి తోడు అవినీతిని అరికట్టడంపై చర్చించామని వెల్లడించారు. అవినీతిపై అన్ని పార్టీలు ఐకమత్యంతో పోరాడాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. అవినీతి నిర్మూలనకు అన్ని రాష్ట్రాల్లో వ్యవస్థలు అవసరమని చెప్పారు. ఆదర్శ్ కుంభకోణం నివేదికపై మహారాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించుకోవాలని సూచించారు.