: జేసీ ఇచ్చే వివరణ ఆధారంగా చర్యలు తీసుకుంటాం: బొత్స
కాంగ్రెస్ నుంచి షోకాజ్ నోటీసులు అందుకున్న జేసీ దివాకర్ రెడ్డి ఇచ్చే వివరణ ఆధారంగా చర్యలు తీసుకుంటామని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ చెప్పారు. పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పకుండా ఉంటాయన్నారు. ఒక్క వ్యక్తి వెళ్లినా పార్టీకి నష్టమేనని, అధిష్ఠానం నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని తెలిపారు. అయితే, ఇతర పార్టీలోకి వెళ్లేవారి వివరాలు పీసీసీ వద్ద జిల్లాల వారీగా ఉన్నాయన్నారు. ప్రజల్లో ఉన్న సెంటిమెంట్ ను ఆసరాగా చేసుకుని అధికారంలోకి రావాలని కొంతమంది చూస్తున్నారని విమర్శించారు. విభజనకు అన్ని పార్టీలు కారణమేనని అందుకే కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందన్నారు. గాందీభవన్ లో జరిగిన మీడియా సమావేశంలో బొత్స మాట్లాడారు. పాలెం బస్సు బాధితుల ధర్నా తనకు తెలియదని, ప్రవేటు బస్సులను అనుమతించవద్దని అధికారులకు చెప్పామన్నారు.