: మెట్రో రైల్లోనే వస్తా: కేజ్రీవాల్
ముఖ్యమంత్రినైనా తాను సామాన్యుడినే అని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. తనకు భారీ కాన్వాయ్, పైలట్ వాహనాలు, కుయ్ కుయ్ మనే సైరన్లు అవసరం లేదని తెలిపారు. రేపు జరగబోయే ప్రమాణ స్వీకారానికి తనతో పాటు మొత్తం ఎమ్మెల్యేలందరూ మెట్రో రైల్లోనే వస్తారని తెలిపారు. ఈ రోజు తన నివాసంలో నిర్వహించిన జనతా దర్బార్ లో ఆయన ఈ విషయం చెప్పారు.
కింద నుంచి పై స్థాయి వరకు వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయని... అందుకే ప్రజలందరూ తమ సమస్యల పరిష్కారం కోసం నేరుగా ముఖ్యమంత్రి వద్దకే వస్తున్నారని కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చాలా దురదృష్టకరమని చెప్పారు. తమపై ప్రజలు భారీగా అంచనాలు పెట్టుకున్నారని... వారి సమస్యలను పరిష్కరించేందుకు తాము కష్టపడి పనిచేయాల్సి ఉంటుందని అన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు రెండ్రోజుల ముందు ఢిల్లీలో వాహనాల గ్యాస్ ధరను పెంచడంపై కేజ్రీవాల్ మండిపడ్డారు. ఇంత హడావుడిగా ఈ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏం వచ్చిందని ప్రశ్నించారు.