: ఈ రోజు నుంచి హైదరాబాదులో ఎక్కడి చెత్త అక్కడే
గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ 'జీహెచ్ఎంసీ' గుర్తింపు పొందిన యూనియన్ జీహెచ్ఎంఈయూ పిలుపు మేరకు పారిశుద్ధ్య కార్మికులు సమ్మెబాట పట్టారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ సిబ్బంది మూకుమ్మడి సెలవుపై వెళ్లారు. దీంతో జంటనగరాల్లో జీహెచ్ఎంసీ సేవలన్నీ ఈ రోజు నుంచి నిలిచిపోనున్నాయి. డిసెంబరు నాటికి సిబ్బంది సమస్యలను పరిష్కరిస్తామంటూ ఇచ్చిన హామీని యాజమాన్యం నిలబెట్టుకోలేక పోయిందని... అందుకే తాము నిరవధిక సమ్మె బాట పట్టామని సిబ్బంది తెలిపారు.
ఔట్ సోర్సింగ్ సిబ్బంది వేతనాన్ని రూ. 16,500లకు పెంచాలని, పట్టణ అలవెన్సులు, జీహెచ్ఎంసీ సిబ్బందికి హెల్త్ కార్డులు ఇవ్వాలని సిబ్బంది డిమాండ్ చేశారు. దాదాపు 20 వేల మంది సిబ్బంది ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. పారిశుద్ధ్య కార్మికుల సమ్మెతో చెత్త తరలింపు, వీధులు ఊడ్చడం, దోమల మందు చల్లడం లాంటి సేవలన్నీ నిలిచిపోనున్నాయి. దీంతో, జంటనగరాల్లో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోనుంది.