: రాహుల్ ఎదుట ధిక్కార స్వరం వినిపించనున్న కిరణ్?
ఢిల్లీలో ప్రారంభమైన కాంగ్రెస్ ముఖ్యమంత్రుల సమావేశంలో అందరి దృష్టి ఏపీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపైనే నిలిచింది. ఓ వైపు ఈ సమావేశం రాహుల్ గాంధీ నాయకత్వానికే సవాల్ గా పరిణమిస్తే... మరోవైపు తన సమైక్య గళం వినిపించేందుకు సీఎం కిరణ్ ఈ సమావేశాన్ని వేదికగా ఉపయోగించుకునే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మేధావుల అంచనా ప్రకారం... రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారయిందన్న విషయాన్ని అధిష్ఠానం దృష్టికి కిరణ్ తీసుకువెళతారు. సీమాంధ్రలో చంద్రబాబు, జగన్ లను తట్టుకునే పరిస్థితి కాంగ్రెస్ కు లేదని చెబుతారు. తెలంగాణలో కాంగ్రెస్ తో టీఆర్ఎస్ ఏ మేరకు కలిసి పనిచేస్తుందనే విషయంలో సందేహాలున్నట్టు కిరణ్ చెబుతారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించినప్పటికీ ఆ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం పుంజుకోలేక పోయిందని సీఎం స్పష్టం చేస్తారు.
అంతేకాకుండా, విభజనతో పార్టీకి, ప్రజలకు జరిగే నష్టాన్ని వివరిస్తూ కిరణ్ తన ధిక్కార స్వరాన్ని వినిపిస్తారని కిరణ్ సన్నిహితులు చెబుతున్నారు. దీనికితోడు, "మీ సీఎం చాలా ధైర్యవంతుడు. ఏ అంశాన్నైనా ఎక్కడైనా ప్రశ్నించగలడు. సమైక్యాంధ్రపై అతని నిజాయతీని శంకించలేం" అని ఓ ఏఐసీసీ నేతే వ్యాఖ్యానించారంటే... పరిస్థితిని కొంత వరకు అర్థం చేసుకోగలం. అయితే, ఈ సమావేశంలో కాంగ్రెస్ పెద్దలు మాత్రమే మాట్లాడతారా? లేక ముఖ్యమంత్రులకు కూడా మాట్లాడే అవకాశం ఇస్తారా? అనే విషయంపై సందేహాలున్నాయి.