: ప్రారంభమైన కాంగ్రెస్ ముఖ్యమంత్రుల సమావేశం
ఢిల్లీలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రుల సమావేశం ప్రారంభమైంది. సోనియా, రాహుల్, చిదంబరం, ఏకే ఆంటోనీ, నారాయణస్వామితో పాటు కాంగ్రెస్ ముఖ్యమంత్రులందరూ వార్ రూమ్ కు చేరుకున్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ అధినేత్రి ముగింపు ప్రసంగం చేయనున్నారు.
ఈ సమావేశంలో లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యంగా దృష్టిని సారించనున్నారు. దీనికి తోడు పెరిగిన ధరల నియంత్రణ, అవినీతి తదితర అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా వీస్తున్న మోడీ గాలి, కొత్తగా వచ్చిన కేజ్రీవాల్ విజయం లాంటి అంశాలపై సమీక్షను నిర్వహించనున్నారు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీపై రాహుల్ గాంధీ పట్టును మరింత పటిష్ఠం చేసేందుకు ఈ సమావేశాన్ని వేదికగా ఎంచుకున్నట్టు సమాచారం.