: ఇకపై ఉద్యమంలో రాజకీయ నేతలు కూడా పాల్గొంటారు: అశోక్ బాబు


ఈ నెల 28న మరోసారి అఖిలపక్షంతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. రానున్న రోజుల్లో రాజకీయ పార్టీలన్నీ తమ జెండాలను, అజెండాలను పక్కన పెట్టి సమైక్య ఉద్యమంలో కలసి పనిచేసేలా కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. ఇకపై జరిగే ఉద్యమంలో ప్రభుత్వ ఉద్యోగులతో కలసి రాజకీయ నేతలు కూడా పాల్గొంటారని వెల్లడించారు. ఈ రోజు విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు.

ఏపీఎన్జీవో ఎన్నికల ప్రచారం కోసం తాము శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో పర్యటించామని అశోక్ బాబు తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతాయని చెప్పారు. ఎన్నికల్లో పోటీ ఉండటం సాధారణ అంశమని... ఎన్నికల తర్వాత ఎపీఎన్జీవోలందరం కలసి సంఘటితంగా సమైక్య ఉద్యమాన్ని ముందుకు తీసుకెళతామని అన్నారు. నాయకత్వం మారినా ఉద్యమంలో వెనుకంజ వేయమని చెప్పారు. తమ ఉద్యమ ఫలితంగానే టీబిల్లు మూడు నెలలు ఆలస్యమయిందని తెలిపారు. ఏపీఎన్జీవోలలో చీలిక వచ్చిందన్న వార్తల్లో వాస్తవం లేదని అన్నారు. త్వరలోనే సీమాంధ్ర పంచాయతీల్లో సమైక్య తీర్మానాలు చేయించి రాష్ట్రపతికి, అసెంబ్లీకి పంపిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News