: నేడు వంగవీటి మోహనరంగా 25వ వర్థంతి
విజయవాడలో ఈరోజు కాంగ్రెస్ నేత వంగవీటి మోహనరంగా 25వ వర్థంతి కార్యక్రమాలను... నగరంలోని పలు ప్రాంతాల్లో రంగా అభిమాన సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రంగా తనయుడు వంగవీటి రాధా తండ్రి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆయన చివరి శ్వాస వరకు విజయవాడ ప్రజల అభివృద్ధి కోసం పాటుపడ్డారని చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన భౌతికంగా దూరమయినా.. ప్రజల మనసుల్లో ఇప్పటికీ జీవించే ఉన్నారని అన్నారు.
వంగనీటి మోహనరంగా జులై 4, 1947న ఉయ్యూరు సమీపంలోని కాటూరులో జన్మించారు. తండ్రి మరణానంతరం రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన విజయవాడ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహించారు. విజయవాడ బందరు రోడ్డులో నిరాహార దీక్షలో పాల్గొన్న ఆయనపై దాడి జరిగింది. దుండగులు అయ్యప్ప భక్తుల ముసుగులో వచ్చి రంగాను డిసెంబరు 26, 1988న హతమార్చారు. రంగా హత్యను జీర్ణించుకోలేని ఆయన అభిమానులు నాలుగు జిల్లాల్లో విధ్వంసానికి దిగారు. ఈ దాడుల్లో 700 బస్సులకు నిప్పంటించారు. మరో 120 పోలీసుల వాహనాలను ధ్వంసం చేశారు. ప్రైవేటు ఆస్తుల లూటీ జరిగింది. పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రభుత్వం 40 రోజుల పాటు కర్ఫ్యూ విధించింది.