: ఎత్తుకు వెళ్లేముందు ఈ పరీక్ష చేయించుకుంటే మంచిది
ఎత్తైన ప్రదేశాలకు వెళ్లినప్పుడు కొందరు అస్వస్థతకు లోనవుతుంటారు. దీంతో వారితోబాటు వెళ్లిన వారికి కూడా సమస్యగా తయారవుతారు. ముఖ్యంగా పర్వతారోహకుల్లో ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఎదురవుతుంటాయి. ఎత్తైన ప్రదేశాలు, భవంతులు, పర్వతాలపైకి వెళితే అస్వస్థతకు లోనవడాన్ని ఆల్టిట్యూడ్ సిక్‌నెస్‌గా పిలుస్తారు. ఇలాంటి సిక్‌నెస్‌ను గుర్తించడానికి శాస్త్రవేత్తలు ఒక కొత్తరకం పరీక్షను కనుగొన్నారు. ఈ పరీక్షను చేయించుకోవడం ద్వారా తమకు ఉన్న సమస్యను పర్వతారోహకులు ముందే తెలుసుకుని, ఎత్తైన ప్రదేశాలకు వెళ్లడానికి దూరంగా ఉండడం, ఒకవేళ వెళ్లాల్సివస్తే ముందుజాగ్రత్తలు తీసుకోవడం వంటివి చేయవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
ఇటలీ, ఫ్రాన్స్ దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు 34 మంది వలంటీర్లపై పరిశోధనలను నిర్వహించారు. గాలిలో ఆక్సిజన్ తక్కువగా ఉన్నప్పుడు ఆల్టిట్యూడ్ సిక్‌నెస్ ఉన్నవారిలో గుండె ప్రతిస్పందన ఎలా ఉంటుందనే విషయాన్ని వీరిలో పరిశోధకులు ప్రత్యేక పరీక్ష ద్వారా గమనించారు. వలంటీర్లను కేబుల్ కారులో 12,600 అడుగుల ఎత్తున్న ఒక పర్వతంపైకి తీసుకెళ్లి అక్కడ పరీక్షలు జరిపారు. ఇందులో వలంటీర్లలో సిస్టోలిక్ పనితీరు నెమ్మదించడం గమనించినట్టు ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్ రోసా బ్రూనో చెబుతున్నారు. తాము కనుగొన్న ఈ పరీక్ష ద్వారా పర్వతారోహణలో భారీ మార్పులు చోటు చేసుకుంటాయని, తమకు ఆల్టిట్యూడ్ సిక్‌నెస్ ఉందని తేలిన వ్యక్తులు ట్రెక్కింగ్‌కు దూరంగా ఉండడం, లేదా మరింత నెమ్మదిగా ఎక్కడం వంటి ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడానికి వీలవుతుందని పరిశోధకులు చెబుతున్నారు.