: ఆహారంలో అయొడిన్‌ తగ్గనీకండి


ఆహారంలో అయొడిన్‌ తగ్గనీకండి, మీ ఉప్పులో అయొడిన్‌ ఉందా... అంటూ ప్రకటనలను మనం వింటుంటాం. అయొడిన్‌ అనేది మన శరీరంలో జీవ క్రియలు సక్రమంగా జరగడానికి చాలా తక్కువ పరిమాణంలో అవసరం. మనం తీసుకునే ఆహారంద్వారా ఇది మన శరీరానికి అందుతుంది. కానీ నేడు మన ఆహారంలో అయొడిన్‌ లోపిస్తోంది. దీంతో అయొడిన్‌ ఉన్న ఉప్పును వాడాల్సిందిగా నిపుణులు సూచిస్తున్నారు. అయొడిన్‌ కలిగిన ఉప్పును రాష్ట్రం మొత్తంగా కేవలం 38 శాతం కుటుంబాలు మాత్రమే వినియోగిస్తున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. అయొడిన్‌ కలిగివున్న ఉప్పుకు వేడి, తేమగాలి, తడి తగిలితే అందులోని అయొడిన్‌ ఆవిరైపోతుంది. కాబట్టి వంటకాలు పూర్తయి కిందికి దించిన తర్వాతే అందులో ఉప్పును కలపాలని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం 150 మైక్రోగ్రాములు అంటే ఒక గుండుసూది తలపరిమాణం అయొడిన్‌ను తీసుకోవాలట. అదే గర్భిణులు, పాలిచ్చే తల్లులు 250 మైక్రోగ్రాముల అయొడిన్‌ను తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్యసంస్థ సూచిస్తోంది. మనం ఎంత అయొడిన్‌ను తీసుకున్నా మన శరీరం మాత్రం దానికి కావాల్సినంతమేరే స్వీకరించి మిగిలిన దాన్ని మూత్రం ద్వారా విసర్జిస్తుంది. గర్భస్థదశలో అయొడిన్‌ లోపిస్తే గర్భస్రావం జరగడం, మృతశిశువు జననం, అనువంశిక లోపాలు, తక్కువ బరువున్న బిడ్డ పుట్టడం, పుట్టుకతో చెవుడు రావడం, తద్వారా మూగతనం రావడం, నరాల లోపాలవల్ల మరుగుజ్జుతనం, పుట్టిన బిడ్డ బుద్ధిమాంద్యానికి గురికావడం వంటి సమస్యలు సంభవించే ప్రమాదముంది.

శైశవదశలో లోపిస్తే గొంతువాపు, అంగవైకల్యం, బుద్ధిమాంద్యం, చురుకుదనం లోపించడం జరుగుతుంది. యుక్తవయసులో అయితే జ్ఞాపకశక్తి, శారీరక ఎదుగుదల తగ్గిపోవడం, పెద్దవారిలో అయితే థైరాయిడ్‌ వాపు వస్తుంది. మహిళల్లో అయితే బరువు పెరగడం, చర్మం పొడిబారడం, జుట్టురాలడం, రుతుక్రమం సరిగాలేకపోవడం, గర్భధారణ సమస్య, చురుగ్గా పనిచేయలేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి చక్కగా మన ఆహారంలో అయొడిన్‌ కూడా ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం నవ్వుతున్న సూర్యుని గుర్తున్న అయొడిన్‌ కలిగిన ఉప్పు ప్యాకెట్లను కొనడం, కొన్న తర్వాత ఉప్పును చక్కగా గాలి దూరని డబ్బాల్లో నిల్వచేసుకుని వాడుకోవడం చేయాలి.

  • Loading...

More Telugu News