: బెజవాడ కనకదుర్గ గుడిలో భవానీ దీక్షల విరమణ
విజయవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షా విరమణ కార్యక్రమం ఇవాళ (బుధవారం) వరుసగా మూడో రోజున కొనసాగుతోంది. కనకదుర్గ అమ్మవారి దర్శనానికి భారీ సంఖ్యలో భవానీ భక్తులు విచ్చేశారు. ఉదయం నుంచే దుర్గాఘాట్ లో పుణ్యస్నానాలు చేసిన భక్తులు అమ్మవారికి తలనీలాలు సమర్పించారు. దుర్గాదేవిని దర్శించుకొన్న అనంతరం ఇరుముడులను హోమగుండంలో వేసి భవానీ దీక్షను విరమించారు. దీక్షా విరమణ కార్యక్రమం మరో రెండు రోజుల పాటు జరగనుంది. భవానీ దీక్షా విరమణ సందర్భంగా దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో రికార్డు స్థాయిలో లడ్డూ విక్రయాలు జరిగాయి. మూడు రోజుల్లో మొత్తం ఐదున్నర లక్షల లడ్డూలను భక్తులకు అందించినట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి.