: చంద్రబాబుతో అయ్యన్నపాత్రుడు భేటీ
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు విశాఖపట్టణంలో భేటీ అయ్యారు. మంత్రి గంటా శ్రీనివాసరావు కుమార్తె వివాహానికి హాజరుకావడానికి చంద్రబాబు వైజాగ్ వెళ్లిన సంగతి తెలిసిందే. మంత్రి గంటా టీడీపీలో చేరుతారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖలో రాజకీయ సమీకరణాలు కూడా మారుతున్నాయి.
అయితే, రానున్న ఎన్నికల్లో తనకు నర్సీపట్నం అసెంబ్లీ సీటు, తన కుమారుడికి అనకాపల్లి ఎంపీ సీటు ఇవ్వాలని చంద్రబాబును కోరడానికే ఆయనతో సమావేశమయ్యానని అయ్యన్న తెలిపారు. ఒకవేళ ఒక కుటుంబానికి రెండు సీట్లు ఇవ్వడం కష్టమైతే, తాను పోటీ నుంచి విరమించుకుంటానని చెప్పారు. మంచి వారినే పార్టీలోకి తీసుకోవాలని తమ అధినేతకు సూచించినట్టు తెలిపారు. బాబుతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇదే సందర్భంగా సమైక్య ముసుగులో జగన్ విభజనకు సహకరిస్తున్నారని విమర్శించారు.