: అమెరికన్ కాన్సులేట్ అధికారులపై ఆంక్షలు కఠినతరం
భారత దౌత్యవేత్త దేవయానిపై అమెరికా దొంగకేసు పెట్టి వేధింపులు ప్రారంభించడంతో.. అందుకు ప్రతిగా భారత్ కూడా క్రమంగా చర్యలను కఠినతరం చేస్తోంది. దేశంలోని నాలుగు అమెరికన్ కాన్సులేట్ అధికారులకు కొత్తగా ఐడీ కార్డులను ఇవ్వనుంది. పాత కార్డుల గడువు పొడిగించాలన్న అభ్యర్థనను భారత్ తిరస్కరించింది. అమెరికాలో భారత దౌత్యవేత్తలకు అందిస్తున్న విధంగానే.. ఇక్కడ కూడా కార్డులను జారీ చేయనున్నారు. పైగా దౌత్యపరమైన రక్షణ వారి కుటుంబ సభ్యులకు ఉండదు. దౌత్యాధికారులకు రక్షణ కూడా అమెరికాలో మన దౌత్యవేత్తలకు లభిస్తున్న తరహాలోనే ఉంటుంది. పైగా నేరాభియోగాల సమయంలో అందరిలానే చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఇక దేవయానిపై కేసు పెట్టిన పనిమనిషి సంగీతా రిచర్డ్స్ ను కేసు పెట్టడానికి కొన్ని రోజుల ముందు భారత్ నుంచి అమెరికన్ అధికారులు రప్పించుకున్న సంగతి తెలిసిందే. అయితే, భారత్ నుంచి సంగీతా, ఆమె భర్త, పిల్లలు అమెరికా వెళ్లడానికి ఢిల్లీలోని ఒక ట్రావెల్స్ కంపెనీ టికెట్లను సమకూర్చింది. వీరికి పన్ను మినహాయింపు కల్పించినట్లు తేలింది. ఈ సదుపాయం దౌత్యసిబ్బందికే ఉంటుంది. దీంతో ట్రావెల్స్ సంస్థపై కేసు నమోదు చేయనున్నారు. మొత్తానికి ఈ చర్యల దెబ్బకు అమెరికా అబ్బా అంటూ దిగిరాకమానదు.