: కుక్కలకన్నా మొసళ్లుంటేనే భద్రత!
ఇంటికి కాపలా పెట్టుకోవాలంటే ఏం చేస్తాం... చక్కగా ఒక వాచ్‌మన్‌నో లేదా మంచి కుక్కలనో పెంచుకుంటాం. అలాకాకుండా మొసళ్లను కాపలాగా పెట్టుకుంటే... అలాంటి ఇంటికి దొంగలేంఖర్మ... బంధువులు కూడా రారు. ఇలాంటి వెరైటీ కాపలా పెట్టుకోవాలని అనిపించిన ఒక ఆసామి చక్కగా తన ఇంటిముందు ఒక పెద్ద మడుగు తవ్వేసుకుని అందులో రెండు మొసళ్లను పెంచేసుకుంటున్నాడు. విశేషం ఏమిటంటే, గత పదిహేనేళ్లనుండీ ఆయనగారి ఇంటిని ఆ మొసళ్లు కాపలా కాస్తున్నాయట. ఈ పదిహేనేళ్లలో తమ ఇంటికి దొంగలు పడింది లేదని ఆయన ఆనందంగా చెప్పుకుంటున్నాడు.
దొంగలభయం ఎక్కువగా ఉండే థాయ్‌ల్యాండ్‌లోని ప్రజలు ఎక్కువగా కుక్కలను పెంచుకుంటుంటారు. కానీ అవిరుప్ నతీప్ అనే ఒక పెద్దమనిషి ఇంటి ముందు చక్కగా ఒక మడుగు తవ్వి దానిలో రెండు మొసళ్లను పెంచుకుంటున్నాడు. చక్కగా ఆ మడుగులో ఉంటూ హాయిగా ఉండే మొసళ్లకు వేసవి కాలంలో కాస్త ఇబ్బంది కలుగుతుంది. అలా ఇబ్బంది రాకుండా ఉండేందుకు వాటిని రోజుకు పదిసార్లు చక్కటి నీళ్లతో కడుగుతానని, అలాగే అప్పుడప్పుడూ వాటిని ఏసీ దగ్గర వదులుతానని, అలా చేయడం వల్ల వాటి ఆరోగ్యం పాడవకుండా ఉంటుందని అవిరుప్ చెబుతున్నారు.
ఇరుగుపొరుగు వారు మాత్రం ఇలా మొసళ్లను పెంచుకుంటే ప్రాణాలతో చెలగాటం ఆడినట్టేనని, కాబట్టి వాటిని వదిలించుకోమని చెబుతుంటే అవిరుప్ మాత్రం 'అవంటే నాకు భయం లేదు. వాటివల్ల నా కుటుంబానికి ఎలాంటి హాని జరగలేదు. పైగా పదిహేనేళ్లలో నా ఇంటిలో ఒక్కసారి కూడా దొంగతనం జరగడంలేదు. నా ఇంటిని అవి చక్కగా దొంగలబారినుండి కాపాడుతున్నాయి. కాబట్టి నేను బతికున్నంతకాలం అవి నాతోబాటే ఉంటా'యంటూ సమాధానం చెబుతున్నాడు. మొత్తానికి అవిరుప్ ఇంటికి చక్కని కాపలా ఏర్పాటు చేసుకున్నాడు మరి!