: రాజకీయ విలువలకు కట్టుబడిన గొప్ప వ్యక్తి సంజీవరెడ్డి: రాష్ట్రపతి ప్రణబ్
అనంతపురంలో మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి శత జయంత్యుత్సవ సభలో రాష్ట్రపతి ప్రణబ్ ప్రసంగించారు. అనంతపురం గడ్డ మీద పుట్టిన ముద్దుబిడ్డ సంజీవరెడ్డి అని ప్రణబ్ చెప్పారు. సంజీవరెడ్డి పిన్న వయస్సులో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా పనిచేసి పార్టీకి సేవలందించారని ప్రణబ్ గుర్తుచేశారు. రెండుసార్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, అనంతరం భారత రాష్ట్రపతిగా పనిచేశారని ప్రణబ్ చెప్పారు. లోక్ సభ స్పీకర్ గా రెండు పర్యాయాలు పనిచేసిన సంజీవరెడ్డి ఆ పదవిలో రాణించారని ఆయన అన్నారు. స్పీకర్ గా ఎన్నికైన తొలి రోజే పార్టీ పదవికి రాజీనామా చేసిన సంజీవరెడ్డి.. రాజకీయ విలువలకు కట్టుబడిన గొప్ప వ్యక్తి అని ప్రణబ్ ప్రస్తుతించారు.
స్వాతంత్ర్య పోరాటంలో గాంధీజీ అనంతపురం వచ్చినప్పుడు ప్రభావితుడైన నీలం సంజీవరెడ్డి 18వ ఏటనే స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారని, క్విట్ ఇండియా ఉద్యమంలో జైలు జీవితాన్ని అనుభవించారని ప్రణబ్ చెప్పారు. దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న సంజీవరెడ్డి.. స్వాతంత్ర్యం తరువాత దేశానికి సేవలందించి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని ప్రణబ్ కొనియాడారు.