: ఘనంగా కాకతీయ ఉత్సవాల ముగింపు వేడుక
వరంగల్ జిల్లాలో ఏడాది పాటు జరిగిన కాకతీయ ఉత్సవాల ముగింపు వేడుక ఆదివారం కన్నులపండువగా సాగింది. పెద్ద సంఖ్యలో పాల్గొన్న జిల్లా వాసులతో పాటు పరిసర ప్రాంత ప్రజలు కూడా పాల్గొని వేడుకకు కొత్త శోభను తీసుకొచ్చారు. వైవిధ్యభరితమైన సాంప్రదాయక నృత్యాలతో కళాకారులు వీక్షకులను కట్టిపడేశారు. ముగింపు ఉత్సవాల ప్రధాన వేడుకను రుద్రేశ్వర స్వామి ఆలయంలో ఏర్పాటు చేశారు. దీంతో రామప్పగుడి, ఖిలావరంగల్, రుద్రేశ్వర స్వామి ఆలయాలకు ప్రజలు భారీగా తరలివచ్చారు.
కాకతీయ ఉత్సవాల ముగింపునకు గుర్తుగా జిల్లా అధికారులు పది అడుగుల పైలాన్ ను ఏర్పాటు చేశారు. కాజీపేటలోని వడ్డేపల్లి చెరువు ముఖద్వారం వద్ద ఈ పైలాన్ ను కేంద్ర మంత్రి బలరాం నాయక్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నాల లక్ష్మయ్య, కలెక్టర్ కిషన్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. పైలాన్ పై అందంగా రూపొందించిన హంస ప్రతిమ తెలంగాణ ప్రాంతానికి రాజముద్ర అవుతుందని పొన్నాల అభిప్రాయపడ్డారు.
రుద్రేశ్వర స్వామి ఆలయంలో ముగింపు ఉత్సవాలను కేంద్ర మంత్రి బలరాం నాయక్, ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి తదితరులు జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ ఉత్సవాలు జరిగేందుకు ప్రతి ఏటా నిధులు కేటాయిస్తామని బలరాం నాయక్ ఈ సందర్భంగా ప్రకటించారు. ఉత్సవాలకు సంబంధించిన ప్రత్యేక సంచికను చీఫ్ విప్ గండ్ర ఆవిష్కరించారు. ఈ ఉత్సవాల్లో 60 లక్షల మంది పర్యాటకులు వచ్చారని.. వచ్చే ఏడాది ఈ సంఖ్య కోటికి చేరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.