: కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి: వీహెచ్
తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తామని ప్రకటించిన కేసీఆర్ ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ప్రశ్నించారు. కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కోరారు. టీబిల్లు అసెంబ్లీకి వచ్చిన తర్వాత కూడా ఇంకా ఏం ఆలోచిస్తున్నారని అన్నారు. ఈ రోజు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తే తెలంగాణ ఏర్పాటు మరింత సులువవుతుందని చెప్పారు. తెలంగాణ ఇస్తే సోనియాకు దండం పెడతా, సోనియా మహాతల్లి అని గతంలో కేసీఆర్ అన్నారని వీహెచ్ గుర్తుచేశారు. టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తే... తెలంగాణ వారు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారని సోనియాతో చెబుతానని అన్నారు. కేసీఆర్ ఇదే తరహాలో వ్యవహరిస్తే... చివరకు ఆయన ద్వంద్వ వైఖరి ప్రజలకు అర్థమవుతుందని హెచ్చరించారు.