: తెనాలి శిల్పిని ప్రశంసించిన ఒబామా
గుంటూరు జిల్లా తెనాలికి చెందిన శిల్పి అక్కల శ్రీరామ్ కు అరుదైన గౌరవం దక్కింది. శిల్పకళకు సంబంధించి శ్రీరామ్ అమెరికాలో పలు ప్రదర్శనలు ఏర్పాటు చేశాడు. అంతేకాకుండా, తాను చెక్కిన గాంధీ విగ్రహాన్ని అమెరికా అధ్యక్షుడు ఒబామాకు బహూకరించాలని అనుకున్నాడు. దీనికి గ్లోబ్ ఇండియా ప్రతినిధి రఘుబీర్ గోయల్ సహకారం తీసుకున్నాడు.
దీంతో, ఈ నెల 12న ఒబామాను కలవొచ్చంటూ వైట్ హౌస్ నుంచి శ్రీరామ్ కు ఆహ్వానం అందింది. దీంతో ఆయన కల నెరవేరింది. ఒబామాను కలవడమే కాకుండా, ఆయనతో ఫొటోలు దిగి, వైట్ హౌస్ లో విందు కూడా ఆరగించాడు. ఈ సందర్భంగా శ్రీరామ్ ప్రతిభను ఒబామా మెచ్చుకున్నారు. అంతేకాకుండా, శిల్పకళకు సంబంధించి వైవిధ్యమైన ఆవిష్కరణలు చేస్తూ ఉండాలని సూచించారు. శ్రీరామ్ బహూకరించిన గాంధీ విగ్రహాన్ని ఒబామా గదిలో ఏర్పాటు చేస్తామని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి.