: కామన్ క్యాపిటల్ కి అర్థమే లేదు: సోమిరెడ్డి
ఉమ్మడి రాజధాని అంటే కేంద్రానికి ఏమాత్రమైనా అవగాహన ఉందా? అని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాజధానిలో సీమాంధ్రులకు కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కానీ ఏదయినా సమస్య వస్తే దానిని గవర్నర్ కి నివేదిస్తే ఆయన తెలంగాణ మంత్రులతో చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తారట. అలా ఎలా జరుగుతుంది? హక్కులు, అధికారాలు లేనప్పుడు కామన్ క్యాపిటల్ అని ఎలా అంటారని నిలదీశారు.
తెలంగాణ ముసాయిదా బిల్లులో తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ నుంచి విద్యుత్ ఎలా రావాలో చెప్పారు కానీ... రెవెన్యూ పంపకాలు ఎలా చేయాలో సూచించలేదని అన్నారు. అత్యధిక ప్రజలు ఉన్న సీమాంధ్రలో ప్రజలు ఆర్థిక లోటుతో ఎందుకు చావాలని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ స్వార్థం కోసం రాష్ట్రాన్ని బలిపీఠం మీదకు ఎక్కించిందని విమర్శించారు.
ఇప్పటికైనా రాష్ట్రపతి జోక్యం చేసుకుని ఈ దారుణాన్ని ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. కొంత మంది రాజకీయ అవసరాల కోసం కోట్ల మంది ప్రజలను బలి చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.