: రోజూ ఇవి నాలుగు తీసుకుంటే మంచిదట
మన రోజువారీ ఆహారంలో రకరకాల పదార్ధాలను చేర్చుకుంటుంటాం. మన ఆరోగ్యానికి మేలు చేసేవి అని తెలిసిన చాలా పదార్ధాలను మన మెనూలో చేర్చుకుంటాం. వాటితోబాటు కాసిన్ని వాల్‌నట్స్‌ని కూడా చేర్చుకుంటే మన గుండె భద్రంగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ప్రతి రోజూ నాలుగు వాల్‌నట్స్ తింటే మన గుండె ఆరోగ్యంగా, భద్రంగా ఉంటుందని పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో వెల్లడయ్యింది.
పెన్సిల్వేనియాలోని స్క్రాన్‌టన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనంలో బాదం, పిస్తా, వేరుశెనగ వంటి పప్పులతో పోల్చుకుంటే వాల్‌నట్స్ మన గుండెకు చాలా మేలుచేస్తాయని, మన గుండెను ఆరోగ్యవంతంగా ఉంచే యాంటీ ఆక్సిడెంట్లు వాల్‌నట్స్‌లో పుష్కలంగా ఉన్నాయని తేలింది. ఈ విషయాన్ని గురించి ఈ పరిశోధనలో పాలుపంచుకున్న జొ విన్‌సన్ మాట్లాడుతూ ఇతర పప్పుల రకాలతో పోల్చుకుంటే వాల్‌నట్స్‌లో మన గుండెకు మేలుచేసే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయని, కానీ చాలామంది వాటిని తీసుకోవడం లేదని, వారి రోజువారీ మెనూలో వాల్‌నట్స్ ఉండేలా చూసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు. ఇతర వాటితో పోల్చుకుంటే వీటిలో రెండు నుండి పదిహేను రెట్లు ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి.
వ్యాధి బారినపడినప్పుడు నేచురల్ కెమికల్స్ దెబ్బతినకుండా చూసి మన శరీరాన్ని రక్షించడంలో ఇవి కీలక పాత్రను పోషిస్తాయి. చాలామంది నట్స్‌ను వేయించుకుని తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు. అయితే వేయించడం వల్ల వాటిలోని యాంటీ ఆక్సిడెంట్ల నాణ్యత తగ్గుతుంది, కానీ వాల్‌నట్స్‌ని వేయించకుండానే తింటారు కాబట్టి యాంటీ ఆక్సిడెంట్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే రోజూ నాలుగు వాల్‌నట్స్ తిని మీ గుండెను భద్రంగా కాపాడుకోండి మరి!