: నెటిజన్ల సమాచార అన్వేషణలో.. అగ్రస్థానంలో నిలిచిన హైదరాబాద్
సమాచార అన్వేషణలో నెటిజన్లు ఈసారి ఎక్కువగా హైదరాబాద్ వార్తల వివరాల కోసం శోధించారు. భారతదేశంలోని ఇంటర్ నెట్ యూజర్లు ఎక్కువ మంది 2013లో మిగతా మెట్రో నగరాలైన బెంగళూరు, ముంబైలను నెట్టి.. రాష్ట్ర రాజధాని హైదరాబాదు సమాచారాన్ని సేకరించారని ప్రముఖ సెర్చ్ ఇంజిన్ సంస్థ గూగుల్ తెలిపింది.
ఫిబ్రవరిలో దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్లు జరిగినప్పుడు ఎక్కువ మంది గూగుల్లో సెర్చ్ చేశారు. ఈ ప్రమాద ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయి, వంద మందికి పైగా గాయాల పాలైనప్పుడు ఆన్ లైన్ లో సమాచారం తెలుసుకొనేందుకు పోటీ పడ్డారు. తెలంగాణ ఉద్యమం కోసం జులై, ఆగస్టు నెల్లో అత్యధికంగా అన్వేషణ సాగించారు. ఇక సెప్టెంబరులో ఐపీఎల్ ఆట గురించి, తీవ్రవాది యాసిన్ బత్కల్ కోసం శోధించారు. అక్టోబరులో జరిగిన వోల్వో బస్సు దుర్ఘటన జరిగిన సమయంలో ప్రయాణికుల క్షేమ సమాచారాల కోసం ఎక్కువగా ఎంక్వైరీ చేశారని గూగుల్ వర్గాలు వెల్లడించాయి.