: నేనొక పోరాట యోధుడిని.. చివరిదాకా పోరాడుతా: సీఎం కిరణ్
తాను వంద శాతం సమైక్యవాదినే అని సీఎం కిరణ్ మరోసారి స్పష్టం చేశారు. తుపానును ఆపలేను కానీ, విభజనను మాత్రం కచ్చితంగా ఆపుతానని గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని ఆయన నొక్కి చెప్పారు. హైదరాబాదులో మీడియాతో మాట్లాడిన ఆయన, రాజ్యాంగం ప్రకారమే విభజన ప్రక్రియ జరగాలని అన్నారు.
శాసనసభ, మండలిలో విభజనకు సంబంధించిన చర్చ ఇంకా ప్రారంభం కాలేదని చెప్పిన ముఖ్యమంత్రి అందరి అయోమయానికి తెరదించారు. నిబంధనల మేరకే సభలో బిల్లును ప్రవేశపెట్టాల్సి ఉంటుందని కిరణ్ తెలిపారు. ఆటలో చివరి బంతి ఇంకా అయిపోలేదని... తానొక పోరాట యోధుడినని, చివరి బంతి వరకు పోరాడుతానని చెప్పారు. బిల్లుపై చర్చ ఎలా కొనసాగాలి? అనే అంశాన్ని సభాపతులే నిర్ణయిస్తారని తెలిపారు. రాష్ట్రంలోని ఇరు ప్రాంత ప్రజలను మెప్పించే విధంగా సభలో చర్చ జరగాలని అన్నారు.