: బిల్లు సీమాంధ్రుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా ఉంది: సీమాంధ్ర బీజేపీ
తెలంగాణ ముసాయిదా బిల్లులోని అంశాలు సీమాంధ్రుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని సీమాంధ్ర బీజేపీ నేత కంభంపాటి హరిబాబు పేర్కొన్నారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ముసాయిదా బిల్లులోని పలు అంశాలకు ప్రాతిపదిక ఏంటో ఎవరికీ అంతుబట్టడం లేదని అన్నారు. అడిగారనే కారణంగా అన్నీ ఇస్తామంటే.. సీమాంధ్రుల ప్రయోజనాలను గాలికి వదిలేసినట్టేనా? అని ఆయన ప్రశ్నించారు. ఉమ్మడి రాజధానిపై రాజ్యాంగ సవరణ చేస్తేనే తమకు సమ్మతమని స్పష్టం చేశారు. బిల్లులో భద్రాచలంతోపాటు మరి కొన్ని ప్రాంతాలపై... ఏమాత్రం అవగాహన లేకుండా ఏది తోస్తే అది రాసినట్టు ఉందని ఆయన మండిపడ్డారు.
తెలంగాణ వారికి ప్రయోజనం చేయాలనుకుంటే తప్పుకాదని, అలాగని సీమాంధ్రను దోచేస్తామంటే ఎవరూ అంగీకరించేది లేదని ఆయన స్పష్టం చేశారు. దీనిపై తమ పార్టీ అధిష్ఠానంతో చర్చించేందుకు ఢిల్లీ వెళ్తున్నామని ఆయన తెలిపారు. తమ పార్టీలో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు తెలంగాణ ప్రాంతానికి చెందిన వారేనని.. అందుకే వారు తెలంగాణ బిల్లుకు అనుకూలంగా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు.