: వారందరికీ మన గవర్నర్ ఆదర్శం
పోలీసు జీపుపై ఎర్రబుగ్గ (ఎర్రలైటు), కార్పొరేటర్ కారుపై ఎర్రబుగ్గ, ఎమ్మార్వో కారుపై ఎర్రబుగ్గ.. వారందరికీ అదో గౌరవ సింబల్ గా మారిపోయింది. కానీ, రాజ్యాంగ పదవుల్లో, అత్యున్నత స్థానాల్లో ఉన్న వారే తమ వాహనాలపై ఎర్రలైట్లు వాడాలని సుప్రీంకోర్టు వారం క్రితం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మూడు నెలల్లో ఎవరు అర్హులో జాబితా ప్రకటించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాల తర్వాత కూడా చోటోమోటా నేతలు, రాజ్యాంగ పదవుల్లో లేని వారు యథావిధిగా ఎర్రలైట్లతో కుయ్ కుయ్ మంటూ వెళుతూనే ఉన్నారు.
కానీ ఇలాంటి వారందరూ మన రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ను చూసైనా నేర్చుకోవాల్సి ఉంది. గవర్నర్ నరసింహన్ రాజ్యాంగ పరిరక్షకుడి స్థానంలో ఉన్నా.. సుప్రీం ఆదేశాలు తెలుసుకుని ఆయన తన కారుపై ఎర్రలైటు కనిపించకుండా దానికి నల్ల కవర్ తొడిగించేశారు. అంతేకాదు, తన కార్యాలయ కార్యదర్శి, ఇతర భద్రతా సిబ్బంది కార్లపై కూడా ఎర్రలైట్లు తొలగించాలని ఆదేశించారు. తొలగించడానికి వీలు కాదని చెప్పడంతో వాటిపై నల్ల కవర్లు తొడిగేయాలని చెప్పారు.