: ఇక పనిలో ఉండగా నిద్రపోలేరు
చాలామంది పనిలో ఉండగా ఒక్కోసారి కునికిపాట్లు పడుతుంటారు. అందునా వాహనాలను నడిపే సమయంలో ఇలా నిద్ర ముంచుకొస్తే చాలా ప్రమాదం. డ్రైవింగ్ సమయంలో కునుకు వల్ల కేవలం మనకే కాకుండా రోడ్డుపై వెళ్లే వారికి కూడా ప్రమాదం సంభవిస్తుంది. అలాకాకుండా మీరు ఏమాత్రం కునికిపాట్లు పడినా వెంటనే మిమ్మల్ని లేపి అప్రమత్తుల్ని చేయడానికి ఒక ప్రత్యేక పరికరాన్ని పరిశోధకులు తయారుచేశారు. ఈ పరికరం మీరు ఏమాత్రం కునికిపాట్లు పడినా వెంటనే మిమ్మల్ని గట్టిగా సూదిలాగా గుచ్చిమరీ నిద్రలేపేస్తుందట.
విద్యార్ధులు తరగతి గదుల్లోను, ఉద్యోగులు తమ ప్రాజెక్టు గురించి ముఖ్యమైన సమాచారాన్ని గురించి వివరించే సమయంలోను, అలాగే డ్రైవర్లు వాహనాలను నడిపే సమయంలోను ఇలా ఎలాంటి ముఖ్యమైన సమయంలోనైనా మీరు ఏమాత్రం కునికిపాట్లు పడినా వెంటనే మిమ్మల్ని లేపేసే ఈ పరికరానికి పరిశోధకులు 'విగో' అని పేరుపెట్టారు. ఈ విగో మీరు అప్రమత్తంగా ఉండాల్సిన సమయంలో మిమ్మల్ని ఏమాత్రం కునికిపాట్లు పడకుండా చేస్తుందట.
ఇందులోని ఇన్‌ఫ్రారెడ్ సెన్సరు, యాక్సెలరో మీటరు దీన్ని ధరించిన వారి శరీర స్పందనలను ఇట్టే గ్రహిస్తుందట. మీకు నిద్రతో కళ్లు మూసుకుపోతున్న విషయాన్ని గుర్తించి వెంటనే మిమ్మల్ని గుచ్చి లేపేస్తుంది. అంటే మీ శరీరం ఏమాత్రం అలసటతో ఉన్నా అది వెంటనే గుర్తించేస్తుంది. విగో బ్లూ టూత్ హెడ్‌సెట్ లాగా పనిచేస్తుందని, దీన్ని బ్లూటూత్ ద్వారానే ఆయా వ్యక్తుల స్మార్ట్ ఫోన్‌కు అనుసంధానం చేయవచ్చని, నిద్రలోకి జారిపోతున్న సమయంలో వైబ్రేషన్ ద్వారాగానీ, లేదా పాటద్వారాగానీ మిమ్మల్ని నిద్ర లేపేస్తుందని దీని తయారుచేసిన వారు చెబుతున్నారు.