: ఫేస్ బుక్ లో లీనమై ... సముద్రంలో పడిపోయిన పర్యాటకురాలు
ఇంటర్నెట్ లో యువతరాన్ని ఊపేస్తున్న సామాజిక అనుసంధాన నెట్ వర్క్ ఫేస్ బుక్ వ్యసనంగా మారుతోంది. కామెంట్లు, అప్ డేట్లు, అప్ లోడ్లు అంటూ పొద్దున లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు ఫేస్ బుక్ లోనే యువతరం గడిపేస్తోంది. తాజాగా ఫేస్ బుక్ వ్యసనానికి పరాకాష్ఠగా మారిన ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది.
ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ సముద్ర తీరంలోని అందాలను ఆస్వాదించేందుకు... సెయింట్ కిల్డా వద్ద సముద్రంలోకి వంతెనలాంటి కట్టడం నిర్మించారు. అక్కడ తైవాన్ కి చెందిన ఓ పర్యాటకురాలు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ.. మరోపక్క తన మొబైల్ నుంచి ఫేస్ బుక్ లో లీనమై వంతెనమీద నుంచి సముద్రంలోకి పడిపోయింది.
దీంతో షాక్ తిన్న తోటి సందర్శకులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు స్పీడ్ బోట్ సాయంతో ఆమెను రక్షించారు. అయితే ఆమెకు ఈత రాదని, సముద్రంలోకి పడిపోయాక కూడా ఫోన్ చేతిలోనే పట్టుకుని ఉందని అశ్చర్యపోయారు. ఫేస్ బుక్ చూసుకుంటూ నడుస్తూ అదుపుతప్పి పడిపోయానని చెప్పిన ఆ యువతి, తనను రక్షించిన పోలీసులకు క్షమాపణలతో పాటు కృతజ్ఞతలు కూడా చెప్పింది.