: అమెరికా టూరిస్ట్ పై అత్యాచారం: నిందితులకు 20 ఏళ్ల జైలు శిక్ష ఖరారు
భారతదేశ ప్రకృతి అందాలను చూసేందుకు హిమాచల్ ప్రదేశ్ కు వచ్చిన 30 ఏళ్ల అమెరికా టూరిస్ట్ పై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు యువకులకు జైలు శిక్ష పడింది. కేసును విచారించిన కులూమనాలి కోర్టు నిందితులకు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షను ఖరారు చేసింది. దాంతో పాటు ఒక్కొక్కరు 10 వేల రూపాయల జరిమానా చెల్లించాలని జిల్లా న్యాయమూర్తి పురంధర్ వైద్య తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించకపోతే మరో రెండేళ్లు జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందని జడ్జి స్పష్టం చేశారు.
ఈ ఏడాది జూన్ లో ఢిల్లీకి వచ్చిన విదేశీ టూరిస్ట్ హిమాచల్ ప్రదేశ్ లోని అందమైన దృశ్యాలను వీక్షించేందుకు కులూమనాలికి వచ్చింది. అక్కడ లిఫ్ట్ ఇస్తామంటూ ఆమెను కారులో ఎక్కించుకొన్న ముగ్గురు నేపాలీ డ్రైవర్లు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాలి వద్ద నుంచి నగదు తీసుకొని నిందితులు పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. పోలీసుల విచారణలో నిందితులు తాము చేసిన నేరాన్ని అంగీకరించారు. నిందితులంతా నేపాల్ వాసులేనని, కారు అద్దెకు తీసుకుని జీవనం సాగిస్తున్న డ్రైవర్లని పోలీసులు వెల్లడించారు.